——- ప్రతి బ్లాక్ స్పాట్‌ను గుర్తించి జియో ట్యాగింగ్ చేయాలి
——- నాలుగు రకాల వ్యర్థాల వేరు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలి
—- జిల్లా కలెక్టర్ ప్రియాంక
నారాయణపేట, సెప్టెంబర్ 16 (జన ఉదయం ప్రతినిధి)
స్వచ్ఛత కార్యక్రమాలు, ఘన వ్యర్థాల నిర్వహణ, నాలుగు రకాల వ్యర్థాల వేరు చేయడం, బ్లాక్ స్పాట్ల నిర్మూలన, లెగసీ వేస్ట్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు.
స్వచ్ఛత కార్యక్రమాలపై నిర్వహించే సమావేశాలు కేవలం సమీక్షకు పరిమితం కాకుండా, ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పటిలోగా పూర్తి చేయాలి, ఇప్పటివరకు ఎంత పురోగతి సాధించాం అనే అంశాల ఆధారంగా స్పష్టమైన యాక్షన్ పాయింట్లు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హి సేవా సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ…
గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో నాలుగు రకాల వ్యర్థాల వేరు చేయడాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. వ్యర్థాల సేకరణ నుంచి రవాణా, ప్రాసెసింగ్ వరకు ప్రతి దశలో సరైన విధానాన్ని పాటించాలన్నారు.
డంపింగ్ ప్రాంతాలు నీటి వనరులు, సాగునీటి కాలువలకు సమీపంలో లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే ఉన్న ప్రాంతాలను పరిశీలించి అవసరమైన సరిదిద్దే చర్యలు చేపట్టాలని తెలిపారు.
బ్లాక్ స్పాట్ల గుర్తింపు, జియో ట్యాగింగ్ ప్రజలు తరచుగా చెత్త వేస్తున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి జియో ట్యాగింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి గ్రామపంచాయతీలో కనీసం ఒక బ్లాక్ స్పాట్‌ను గుర్తించాలని, మున్సిపాలిటీలలో కనీసం 2–3 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటి రూపాంతరానికి చర్యలు చేపట్టాలని సూచించారు. గుర్తించిన ప్రాంతాల బిఫోర్–ఆఫ్టర్ ఫొటోలను తప్పనిసరిగా సేకరించి సంబంధిత పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు. డంపింగ్ యార్డులను మాత్రమే బ్లాక్ స్పాట్లుగా చూపకుండా, ప్రజలు వాస్తవంగా చెత్త వేస్తున్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని స్పష్టం చేశారు.
మున్సిపాలిటీలలో పేరుకుపోయిన లెగసీ వేస్ట్‌ను దశలవారీగా తొలగించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఏజెన్సీల పనితీరును సమీక్షించి, అవసరమైతే సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ప్రతి మున్సిపాలిటీ ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ప్రత్యక్షంగా కనిపించే విధంగా స్వచ్ఛత, రూపాంతర కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో సీఎస్ఆర్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి విద్యార్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో గోడలపై స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన కల్పించే పెయింటింగ్‌లు వేయించాలని తెలిపారు.
అక్టోబర్ 1న “ఏక్ దిన్ – ఏక్ గంట – ఏక్ సాత్” కార్యక్రమంలో భాగంగా సామూహిక శ్రమదానం నిర్వహించాలని అధికారులను ఆమె ఆదేశించారు.
పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేసి ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు గ్లౌజులు, అవసరమైన భద్రతా పరికరాలు అందించి, భద్రతా ప్రమాణాలను పాటించాలని తెలిపారు.
స్వచ్ఛత కార్మికులకు ఆరోగ్య శిబిరం స్వచ్ఛత కార్యక్రమాల్లో కీలకంగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
సంబంధిత వైద్యాధికారులతో పాటు అవసరమైన చోట ప్రైవేట్ వైద్యులను కూడా భాగస్వామ్యం చేసి ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
పాఠశాలలు, జూనియర్ కళాశాలలతో సమన్వయం చేసుకుని విద్యార్థులకు వ్యర్థాల వేరు చేయడం, ఘన–ద్రవ వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత, నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని తెలిపారు.
ఎస్ బి ఎం గ్రామీణ్ కింద సృష్టించిన ఆస్తులు, స్వచ్ఛత జ్ఞాన్ యాత్ర వంటి కార్యక్రమాలను కూడా స్వచ్ఛత కార్యక్రమాలతో అనుసంధానం చేయాలని సూచించారు.
గ్రామాభివృద్ధి ప్రణాళికలో ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత…..
గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికతో పాటు రూపొందిస్తున్న మూడు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికలో గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు.
ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి శాఖ అధికారి తమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు, అర్హతలు, ప్రయోజనాలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను సిద్ధంగా ఉంచుకుని గ్రామస్థాయి సమావేశాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
గ్రామస్థాయి అవసరాలను గుర్తించాలి…
మండల స్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, అనంతరం ప్రతి గ్రామపంచాయతీలో సమావేశాలు నిర్వహించి ప్రజల అవసరాలు, సమస్యలు, అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించాలని సూచించారు.
రహదారులు, పాఠశాలలు, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతులు, ఉపాధి, మహిళా సంఘాల అభివృద్ధి తదితర అంశాలను ప్రణాళికలో చేర్చాలని తెలిపారు.
గ్రామస్థాయి అవసరాలను చర్చించి, గ్రామసభ ద్వారా వాటికి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించి అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.
తదుపరి సమీక్షా సమావేశానికి అధికారులు కేవలం సమావేశాలు నిర్వహించిన వివరాలతో కాకుండా, ఇప్పటివరకు చేసిన పనులు, చేపట్టాల్సిన తదుపరి చర్యలు, బాధ్యత వహించే అధికారి, కాలపరిమితి, సాధించిన పురోగతికి సంబంధించిన ఫొటోలు, జియో ట్యాగింగ్ తదితర ఆధారాలతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను,
డిఆర్డిఓ వెంకట్ రాములు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రామలింగేశ్వర గౌడ్, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సిద్ధప్ప, జిల్లా మత్స్యశాఖ అధికారి రెహమాన్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీ పీ ఆర్ వో రషీద్, మున్సిపల్ కమిషనర్లు శంకర్, రాజయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
