విజయవంతమైన చేనేత కార్మికుల ‘చలో కలెక్టరేట్’ మహా ధర్నా

– అవినీతి సొసైటీల తీరుపై ప్రభుత్వాన్ని నిలదీసిన జనసేన నాయకులు డా. మణికంఠ గౌడ్

​నారాయణపేట, సెప్టెంబర్ 9( జన ఉదయం ప్రతినిధి)

నారాయణపేట చేనేత పరిశ్రమను నాశనం చేస్తున్న అవినీతి పాలకుల, స్వార్థ సొసైటీ నాయకుల చర్యలకు వ్యతిరేకంగా చేనేత కార్మికులు చేపట్టిన ‘చలో కలెక్టరేట్’ మహా ధర్నా బుధవారం జిల్లా కేంద్రంలో నారాయణపేటలో చేపట్టినటి ధర్నా ఎంతో విజయవంతమైంది. ఈ ధర్నాలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్ జిల్లా నాయకులు గుడిసె నర్సింహ, కోస్గి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు అఖిలపక్ష సీపీఎం,బీఎస్పి బీఆర్ఎస్,ఎంఐఎం, టి టీడీపీ, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా డాక్టర్ మణికంఠ గౌడ్ చేనేత కార్మికుల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. ఒకప్పుడు జాతీయ స్థాయిలో బ్రాండ్‌గా నిలిచిన నారాయణపేట చేనేత పరిశ్రమ, నేడు దళారుల చేతుల్లో విలవిలలాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

​ధర్నాలో లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు…

​రూ. 51 కోట్ల మహా కుంభకోణంపై విచారణ:

గాంధీనగర్ సొసైటీ (రూ. 40 కోట్లు), సరాఫ్ బజార్ లక్ష్మీ సొసైటీ (రూ. 6 కోట్లు), చిన్న జట్రం సొసైటీ (రూ. 7 కోట్లు)లలో జరిగిన అక్రమాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల నుండి పవర్‌లూమ్ బట్టలు తెచ్చి టెస్కోకు చేనేత ఉత్పత్తులుగా అమ్ముతున్న అధికారుల సిండికేట్‌ను శిక్షించాలన్నారు .
​ఇంటి స్థలాల పరిరక్షణ – రిజిస్ట్రేషన్: 1961లో కార్మికులకు కేటాయించిన 444 గజాల స్థలాన్ని 222 గజాలకు కుదించే కుట్రను తక్షణమే విడనాడి, లబ్ధిదారులకు పూర్తి స్థలంపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయాలన్నారు .
​వారసత్వ సభ్యత్వం – ఎన్నికలు: దశాబ్దాలుగా సొసైటీలకు సేవ చేసిన పెద్దల కుటుంబాలకు వారసత్వ సభ్యత్వం నిరాకరించడాన్ని ఆపాలి. 2002లో దరఖాస్తు చేసుకున్న 465 మందిలో అర్హులందరికీ సభ్యత్వం ఇచ్చి, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 18 సొసైటీలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నారు .
​సంక్షేమ పథకాల్లో పారదర్శకత: రోజుకు కేవలం రూ. 250 – 300 కూలీతో అప్పుల పాలవుతున్న కార్మికులను ఆదుకోవాలి. ‘నేతన్న చేయూత’ (రూ. 5 లక్షల బీమా) పథకంలోకి చొరబడిన బినామీలను ఏరివేసి, జియో ట్యాగింగ్ అక్రమాలను అరికట్టాలి. అర్హులైన వారికి ఉచిత మగ్గాలు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు.
​కార్మికుల పక్షాన నిలబడటమే జనసేన పార్టీ సిద్ధాంతమని, చేనేత కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జనసేన నాయకులు, అఖిలపక్ష నేతలు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.