జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

– గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన

-ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు.. ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలి

నారాయణపేట, అక్టోబర్‌ 2 (జన ఉదయం ప్రతినిధి)

జర్నలిస్టుల హక్కులు, భద్రత, సామాజిక సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐజేయూ పిలుపు మేరకు అక్టోబర్‌ 2ను ‘పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం’గా పాటిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో గల మహాత్మాగాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం శ్రీగార్డెన్‌లో జిల్లా కలెక్టర్‌ ప్రియాంక, ఎంపీ డీకే అరుణలను కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని, వినతిపత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించాలని కోరారు.

జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం…

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు కోయిలకొండ నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి శివశంకర్, నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యుడు నక్క శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు వృత్తిపరమైన భద్రతతో పాటు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.
గత నాలుగు దశాబ్దాల్లో మీడియా రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. 24 గంటల వార్తా ప్రసారాలు, డిజిటల్‌ మీడియా, సామాజిక మాధ్యమాల విస్తరణ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మీడియా రంగాన్ని సమగ్రంగా సమీక్షించేందుకు కొత్త మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పనిచేస్తున్న పాత్రికేయులు, పాత్రికేయేతర మీడియా ఉద్యోగుల కోసం కొత్త వేతన మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలను సవరించి, ముద్రణ, ప్రసార, డిజిటల్‌ మీడియా ఉద్యోగులకు న్యాయమైన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో జర్నలిస్టులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు జారీ చేసి నగదు రహిత వైద్య సేవలు అందించాలని కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తగిన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు హన్మంతు, గురుప్రసాద్, కార్యదర్శులు అజీజ్‌ అహ్మద్‌ఖాన్, విటోబా, మహమ్మద్‌ తఖీ, కోశాధికారి మధుకర్, ప్రచార కార్యదర్శి సురేష్, విద్యాశాఖ కన్వీనర్‌ రాజేష్ పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు వీరన్న, ఎల్లారెడ్డి, సురేష్‌గౌడ్, నరేందర్, విజయ్, ప్రవీణ్,అజీజ్‌ఖాన్, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, ఆనంద్, ఎశ్వంత్, మహమ్మద్‌ హుసేన్, నర్సింహా, అశోక్, బ్రహ్మానందరాజు, అశ్వక్, సురేష్, శ్రీనివాస్ తదితరులతో పాటు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.