–దామరగిద్ద కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రియాంక
నారాయణపేట, అక్టోబర్ 6 (జన ఉదయం ప్రతినిధి)
దామరగిద్ద మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల/కళాశాలను జిల్లా కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదుల భవనాన్ని పరిశీలించిన ఆమె, నిర్మాణ పనులు తుది దశలో ఉన్నందున పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులను ఫోన్ ద్వారా ఆదేశించారు.
పాఠశాల ఆవరణలో ఫర్నిచర్ నిరుపయోగంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాత భవనంలో పాఠశాల, కళాశాల తరగతుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎస్ఓ స్వాతి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, నూతన భవనంలోని కింది అంతస్తులో ఉన్న అదనపు గదులను తరగతుల నిర్వహణకు వినియోగించుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని సందర్శన…..
కలెక్టర్ విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకున్నారు. ఉన్నత విద్యలో ఏ కోర్సులు చదవాలనుకుంటున్నారని ప్రశ్నించగా, విద్యార్థినులు న్యాయ విద్యను అభ్యసించాలని ఉందని తెలిపారు. విద్యార్థినులు పట్టుదలతో చదివి కనీసం డిగ్రీ వరకు విద్యను కొనసాగించాలని, ఉన్నత విద్యతో పాటు భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
వొకేషనల్ తరగతి గదిని సందర్శన….
విద్యార్థినులతో మాట్లాడిన కలెక్టర్, వారి భవిష్యత్ విద్యా ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. బీఎస్సీ నర్సింగ్ చదవాలనుకుంటున్నామని విద్యార్థినులు తెలపగా, జిల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాల అందుబాటులోకి రానుందని, విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పోషకాహారం తీసుకోవాలని తెలిపారు.
మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థినుల వద్దకు వెళ్లిన కలెక్టర్, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు. మెస్ కమిటీ విద్యార్థినులతో మాట్లాడి కూరగాయలు, నిత్యావసర సరుకుల నాణ్యత, భోజన నిర్వహణను క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టోర్ రూమ్‌ను పరిశీలించి నిత్యావసర సరుకుల నిల్వలను తనిఖీ చేశారు. మెనూ బోర్డును చూశారు.
పాఠశాలలోని ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదని తెలుసుకున్న కలెక్టర్ వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. అవసరమైతే కొత్త ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు.
డైనింగ్ షెడ్‌ను పరిశీలించిన కలెక్టర్, పక్షులు లోపలికి రాకుండా షెడ్ ఎత్తును పెంచి అవసరమైన నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎస్ఓను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన, నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
