– నగదు, విలువైన పత్రాలు బూడిద
– ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
– కేసు నమోదు చేసుకుని పరిశీలిస్తున్న ఎస్ఐ అశోక్ బాబు
నారాయణపేట, అక్టోబర్ 08( జన ఉదయం ప్రతినిధి )
మక్తల్ నియోజకవర్గం మాగనూర్ మండల పరిధిలోని నేరేడుగాం గ్రామంలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో విలువైన పత్రాలు, గృహోపకరణాలు, నగదు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
మాగనూర్ ఎస్సై పి. అశోక్ బాబు తెలిపిన వివరాల ప్రకారం…
నేరేడుగాం గ్రామానికి చెందిన రైతు షేకసింది వెంకట్రాములు (46) అక్టోబర్ 1న తన ఇంటికి తాళం వేసి భార్య కవితతో కలిసి ముంబై వెళ్ళాడు. అక్టోబర్ 6వ తేదీ తెల్లవారుజామున సుమారు 2:00 గంటల సమయంలో వారి ఇల్లు తగలబడుతుండటాన్ని గమనించిన వెంకట్రాములు అన్న కుమారుడు సాయిబన్న, స్థానికులతో కలిసి ఇంటి తాళాలు పగలగొట్టి మంటలను అదుపు చేశారు. అనంతరం ఈ విషయాన్ని ఫోన్ ద్వారా వెంకట్రాములుకు సమాచారం అందించారు.
అక్టోబర్ 7 రాత్రి ఇంటికి చేరుకున్న బాధితులు పరిశీలించగా, ఇంట్లోని ఇనుప బీరువాలో ఉన్న బట్టలు, రూ. 48,000 నగదు, మఖ్తల్ లోని ప్లాట్ల కాగితాలు, ముంబైలోని 5 ఇండ్ల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఎల్.ఐ.సి (LIC) బాండ్లు, పిల్లల పుట్టినరోజు ధృవీకరణ పత్రాలు మరియు బైక్ (TS 06 E 2749) ఒరిజినల్ ఆర్.సి పూర్తిగా కాలిపోయాయి. వీటితో పాటు ఇంట్లోని ఎల్‌జీ టీవీ, ఎల్‌జీ ఫ్రిడ్జ్, కూలర్ తదితర సామాగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకట్రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాగనూర్ పోలీసులు క్రిమినల్ కేసు నెం. 175/2026 (అగ్నిప్రమాదం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
