వైద్య ఆరోగ్య శాఖ సేవల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలి

–ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా పనితీరును సమీక్షించి ర్యాంకింగ్ ఇవ్వాలి

–జిల్లా కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట, అక్టోబర్ 8 (జన ఉదయం ప్రతినిధి)

జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు తదితర అంశాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు, పురోగతిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మెడికల్ ఆఫీసర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ…

జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పరిమిత వనరులు, సిబ్బంది కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. అయితే వైద్య సేవలతో పాటు శాఖకు సంబంధించిన అన్ని సూచికలు, గణాంకాల్లో కూడా నిరంతరం పురోగతి సాధించాలని సూచించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల అందుబాటు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందిస్తున్న సేవలు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

“నివారణ చికిత్స కంటే మేలు” అనే సూత్రానికి అనుగుణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య మహిళతో పాటు ఇతర నివారణాత్మక ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. అంటువ్యాధుల నియంత్రణ, ముందస్తు గుర్తింపు, ప్రజల్లో ఆరోగ్య అవగాహన వంటి అంశాలపై మరింతగా దృష్టి సారించాలని ఆదేశించారు.
జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఏవైనా లోటుపాట్లు, సమస్యలు ఉంటే వాటిని గుర్తించి పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సహకరిస్తుందని కలెక్టర్ తెలిపారు. అదే స్థాయిలో అధికారులు, సిబ్బంది కూడా పూర్తి నిబద్ధతతో పనిచేయాలని కోరారు.
ప్రతి నెల మొదటి వారంలో నిర్వహించే సమీక్షా సమావేశంలో గత నెలలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతి, ఇంకా సాధించాల్సిన లక్ష్యాలపై స్పష్టమైన నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా అన్ని అంశాల్లో పనితీరును పాయింట్ల ఆధారంగా విశ్లేషించి ర్యాంకింగ్ ఇవ్వాలని సూచించారు.
గతంలో జిల్లాల వారీగా పనితీరును వివిధ పారామీటర్ల ఆధారంగా ర్యాంకింగ్ చేసిన విధానాన్ని అనుసరించి, జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరును కూడా వివిధ సూచికల ఆధారంగా అంచనా వేసి ర్యాంకింగ్ రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. తద్వారా మెరుగైన పనితీరు కనబరుస్తున్న కేంద్రాలను గుర్తించడంతో పాటు, వెనుకబడిన కేంద్రాల్లో అవసరమైన చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ప్రతి సమీక్షా సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా పనితీరు, పురోగతి, లోటుపాట్లు, మెరుగుదల కోసం తీసుకున్న చర్యలపై సమగ్రంగా సమీక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు.

అంతకుముందు సమావేశంలో
జిల్లాలోని పీ హెచ్ సీల వారీగా సాధారణ, సిజేరియన్ ప్రసవాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తలసేమియా కేసుల పరిస్థితిపై ఆరా తీశారు. గత మూడు నెలల ఆరోగ్య మహిళా స్క్రీనింగ్ వివరాలను సమీక్షించి, మద్దూరులో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి సెర్ప్ సిబ్బంది సమన్వయంతో మహిళలందరికీ స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి సంబంధించిన స్క్రీనింగ్ నివేదిక సిద్ధం చేసి, మహిళలను మరింతగా మొబిలైజ్ చేయాలని సూచించారు.
ఇమ్యూనైజేషన్, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై సమీక్షిస్తూ ప్రజాప్రతినిధుల సమన్వయంతో శిబిరాలు నిర్వహించి శతశాతం కవరేజీ సాధించాలని ఆదేశించారు. ఆర్‌బీఎస్‌కే శిబిరాల ద్వారా గుర్తించిన ఎనీమియా, క్రిటికల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని పాఠశాలల్లో శిబిరాలు పూర్తి చేయాలని సూచించారు.
ఎన్‌సీడీ, హైపర్‌టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ స్క్రీనింగ్, ఎన్‌టీఈపీ, టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా నివారణకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఫైలేరియా బాధితులకు అవసరమైన చికిత్స అందుతున్నదీ లేదీ పరిశీలించాలని ఆదేశించారు.
వచ్చే నెల సమీక్ష సమావేశానికి అన్ని కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు, నివేదికలతో హాజరు కావాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సిద్ధప్ప, డీపీవో బిక్షపతి, మెడికల్ ఆఫీసర్లు, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.