Road Accident: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసుల మృతి

Road Accident

Road Accident: సౌదీ అరేబియాలో అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి.. ఏకంగా 45 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో (సౌదీ కాలమానం ప్రకారం) మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు బయలుదేరిన యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటం వల్ల వారికి తప్పించుకునే అవకాశం దక్కలేదు. దీంతో 45 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. మృతులు మెుత్తం హైదరాబాద్‌వాసులేనని తెలియడంతో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లేపల్లి, బజార్‌ఘాట్ ప్రాంతాలకు చెందిన సుమారు 18 మంది యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ఈ యాత్రికులు మెహదీపట్నంలోని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. మక్కా యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మదీనాకు 25 కి.మీ దూరంలో బస్సు- డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొనటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Road Accident: ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు సకాలంలో సమాచారం, సహాయం అందించేందుకు రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు లేదా సమాచారం కావాల్సిన వారు సంప్రదించడానికి అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేశారు +91 79979 59754, +91 99129 19545 ద్వారా సంప్రదించాలని కోరారు.

చనిపోయిన వారి వివరాలు

కదీర్‌ మహ్మద్, మహ్మద్‌ మౌలానా, షోయబ్‌ మహ్మద్, రహీమున్నీసా, రహమత్‌ బీ, షెహనాజ్‌ బేగం, గౌసియా బేగం, సోహైల్‌ మహ్మద్, మస్తాన్‌ మహ్మద్, ఫర్హీన్‌ బేగం, జహీన్‌ బేగం, మహ్మద్‌ మంజూర్‌, మహ్మద్‌ అలీ, పర్వీన్‌ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం ఉన్నారు. మరికొందరి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *