Ind vs NZ T20: టీ20 సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా: చివరి మ్యాచ్‌లో 46 పరుగుల విజయం

Ind vs NZ T20: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో గెలిచి, 4-1తో సిరీస్‌ను ఘనంగా ముగించింది.

Ind vs NZ T20: టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు, భారత జట్టు న్యూజిలాండ్‌తో ఆడిన చివరి టీ20 సిరీస్‌ను విజయవంతంగా ముగించింది. ఐదు మ్యాచ్‌లతో కూడిన ఈ టీ20 సిరీస్‌లో టీమిండియా4-1 తేడాతో న్యూజిలాండ్ ను  ఓడించింది. సిరీస్‌లో చివరి మ్యాచ్ కేరళ రాజధాని తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది .  ఈ మ్యాచ్ లో టీమిండియా 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే మొదటి మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను ఖాయం చేసుకుంది. నాలుగో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచి కొంత ఆత్మవిశ్వాసం పొందినట్టుగా కనిపించినా, చివరి మ్యాచ్‌లో భారత జట్టు మరోసారి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

Ind vs NZ T20: టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. భారత ఇన్నింగ్స్‌కు సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఆరంభం ఇచ్చారు. అయితే ఇద్దరూ కలిపి 42 పరుగుల వద్దే అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్  న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 103 పరుగులు చేసి తన తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేశాడు.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతంగా రాణించాడు. అతను 30 బంతుల్లో 63 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వేగం ఇచ్చాడు. చివర్లో హార్దిక్ పాండ్య 17 బంతుల్లో 42 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, కైల్ జామిసన్ చెరో రెండు వికెట్లు తీశారు.

Ind vs NZ T20: లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌కు మంచి ఆరంభం లభించింది. ఫిన్ అలెన్ 38 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టుకు దూకుడు ప్రారంభం ఇచ్చాడు. రచిన్ రవీంద్ర 17 బంతుల్లో 30 పరుగులు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ కివీస్ వైపు వెళ్లేలా కనిపించింది. అయితే ఆ తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా స్పందించారు.

అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అక్షర్ పటేల్ మూడు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశారు. ఫలితంగా న్యూజిలాండ్ జట్టు 19.4 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌట్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *