Australia: ఆస్ట్రేలియాలో జరిగిన ఒక హృదయాన్ని తాకే ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 13 ఏళ్ల బాలుడు ఆస్టిన్ ఆపిల్‌బై, దాదాపు నాలుగు గంటల పాటు సముద్రంలో ఈత కొట్టి, తన తల్లి మరియు ఇద్దరు తమ్ముళ్ల ప్రాణాలను కాపాడాడు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని క్విండాలప్ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదకర పరిస్థితుల్లోనూ ధైర్యం, దృఢ సంకల్పంతో ఆస్టిన్ చూపిన సాహసం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ది గార్డియన్ కథనం ప్రకారం, జోన్ ఆపిల్‌బై తన ముగ్గురు పిల్లలు ఆస్టిన్, బ్యూ, గ్రేస్‌లతో కలిసి పెర్త్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్విండాలప్‌కు సెలవులకు వెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం, వారు బీచ్ వద్ద పాడిల్‌బోర్డులతో నీటిలో సరదాగా గడుపుతున్నారు. మొదట పరిస్థితి సాధారణంగానే ఉంది. కానీ కొంతసేపటికి పిల్లలు తీరానికి దూరంగా వెళ్లారు. అదే సమయంలో అకస్మాత్తుగా బలమైన గాలి వీచడం మొదలైంది.
Australia: గాలి తీవ్రత పెరగడంతో పాడిల్‌బోర్డుల ఓర్లు తెగిపోయాయి. దీంతో తల్లి, పిల్లలు నెమ్మదిగా సముద్రంలోకి కొట్టుకుపోవడం ప్రారంభించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నట్టు గ్రహించిన జోన్, సహాయం కోసం ఎవరైనా ఒడ్డుకు చేరాలని నిర్ణయించింది. అందులో భాగంగా తన పెద్ద కుమారుడు ఆస్టిన్‌ను ఎంచుకుంది. ఆస్టిన్ సముద్రంలోకి దూకి, అలలను ఎదుర్కొంటూ ఈత కొట్టడం ప్రారంభించాడు.
సహాయం అందుబాటులోకి రాకపోవడంతో, అతను తన లైఫ్ జాకెట్‌ను కూడా విప్పేశాడు. భయం ఉన్నప్పటికీ, ప్రార్థనలు చేస్తూ, పాటలు పాడుకుంటూ తన మనోధైర్యాన్ని నిలుపుకున్నాడు. తల్లి, తమ్ముళ్లు, స్నేహితుల గురించి ఆలోచిస్తూ ముందుకు సాగాడు. చివరకు అతని కాళ్లు భూమిని తాకినప్పుడు, తాను ఒడ్డుకు చేరుకున్నానని నమ్మలేకపోయాడు. వెంటనే రెండు కిలోమీటర్లు పరిగెత్తి, తల్లి బ్యాక్‌ప్యాక్ వద్ద ఉన్న ఫోన్‌తో పోలీసులకు, రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇచ్చాడు.
కాల్ చేసిన అనంతరం అతను తీవ్ర అలసటతో స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తరలించిన సమయంలో, తన కుటుంబం బతికే ఉందో లేదో కూడా అతనికి తెలియదు. మరోవైపు, తల్లి మరియు చిన్న పిల్లలు లైఫ్ జాకెట్లు ధరించి, పాడిల్‌బోర్డును పట్టుకుని చీకటి, చలి, ఎత్తైన అలల మధ్య సముద్రంలో తేలుతూనే ఉన్నారు. దాదాపు 10 గంటల తర్వాత, రక్షక బృందాలు వారిని తీరానికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
పోలీసులు మాట్లాడుతూ, ఆస్టిన్ ధైర్యం లేకపోతే ఈ ఘటన మరోలా ముగిసేదని అన్నారు. సముద్ర వాతావరణం ఎంత వేగంగా మారుతుందో ఈ సంఘటన స్పష్టంగా చూపించిందని తెలిపారు. ఆస్టిన్ మాత్రం తనను తాను హీరోగా భావించనని, అవసరమైనది మాత్రమే చేశానని చెప్పాడు.
