—-ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను గౌరవంగా స్వీకరించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలి.
—– రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య…
నారాయణపేట, సెప్టెంబర్ 16 (జన ఉదయం ప్రతినిధి)
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సామాజిక, న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్సీ,ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు.
బుధవారం నారాయణపేటకు విచ్చేసిన ఆయనకు కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రియాంక , ఎస్పీ డాక్టర్ వినీత్ పూల మొక్కలు ఇచ్చి స్వాగతం పలకగా, పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతర కలెక్టరేట్ సమావేశ మందిరంలో ల్యాండ్, సర్వీస్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యలు, న్యాయపరమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్, ఎస్సీ కమిషన్ సభ్యులు కే. లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీ ఆర్వో రాజేశ్వరి, ఆర్డీఓ రమేష్, ట్రైనీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్ ఫణి కుమార్ డీఎస్పీ నల్లపు లింగయ్య తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ…
ప్రజలు తమ సమస్యలపై అధికారులను ఆశ్రయించినప్పుడు వారితో మర్యాదగా మాట్లాడి, సమస్యను పూర్తిగా తెలుసుకుని తగిన మార్గనిర్దేశం చేయాలని, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవప్రదమైన సేవలు అందించడం ద్వారా వారి సమస్యలను చాలా వరకు అక్కడికక్కడే పరిష్కరించవచ్చన్నారు. ప్రతి నెలా చివరి వారంలో నిర్వహించే సివిల్ రైట్ డే సమావేశాలలో పోలీస్, రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.
ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే సమావేశాలకు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, తహసీల్దార్లు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా స్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారుల స్థానంలో ఇతర సిబ్బందిని పంపకుండా బాధ్యత కలిగిన అధికారులు స్వయంగా సమావేశాలకు హాజరై సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి నెల చివరి వారంలో సంబంధిత స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు, ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి ఎస్సీ, ఎస్టీల సమస్యలపై పురోగతిని సమీక్షించాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి…
ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, విద్యా, ఉపాధి పథకాలపై గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు.
విద్యార్థులకు అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలు, పబ్లిక్ స్కూళ్లలో సీట్లు, ఉన్నత విద్య, విదేశీ విద్యకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం, భూమి ఆధారిత పథకాలు, ఇతర సంక్షేమ పథకాల వివరాలను అర్హులైన వారికి తెలియజేసి వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు సహకరించాలని సూచించారు.
రిజర్వేషన్లు, రోస్టర్ విధానం పక్కాగా అమలు చేయాలి…
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన రిజర్వేషన్ నిబంధనలు, రోస్టర్ విధానం, రిజర్వేషన్ రిజిస్టర్లను నిబంధనల ప్రకారం నిర్వహించాలని చైర్మన్ ఆదేశించారు. రిజర్వేషన్ల అమలులో ఎలాంటి అవకతవకలకు, అన్యాయానికి అవకాశం లేకుండా జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి…
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు సంబంధించిన నిధులు ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ఆయా నిధులను ఇతర సాధారణ అవసరాలకు లేదా సంబంధం లేని కార్యక్రమాలకు మళ్లించి ఖర్చు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన నిధులు పక్కదారి పడితే సంబంధిత అధికారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని, నిధుల వినియోగంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.
ప్రభుత్వం నుంచి కేటాయించబడే నిధులు, పథకాల ద్వారా లబ్ధిదారులకు అందాల్సిన ప్రయోజనాలు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేటాయించిన బడ్జెట్‌కు అనుగుణంగా నిధులను సక్రమంగా వినియోగిస్తూ, అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు.
ప్రభుత్వం కేటాయించిన నిధులు, పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులకు సూచించారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని తెలిపారు.
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి…..
ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు చట్ట ప్రకారం వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను పెండింగ్‌లో ఉంచకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
మానవతా దృక్పథంతో సేవలందించాలి….
ప్రభుత్వ ఉద్యోగం ప్రజలకు సేవ చేసే మంచి అవకాశమని, అధికారులు తమ విధులను మానవతా దృక్పథంతో నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును సానుకూలంగా పరిశీలించి, వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.
సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సున్నితంగా అర్థం చేసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా స్థాయిలోనే సాధ్యమైన సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు రాష్ట్ర స్థాయి కమీషన్‌ను ఆశ్రయించాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్ నాయకత్వంలో జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.
అంతకు ముందు సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పరిహారం, కులాంతర వివాహాల పరిహారం, పెండింగ్ నిధుల వివరాలను సమర్పించాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాల వివరాలను కూడా అందించాలని కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించగా,
జిల్లాలో సుమారు 26 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండు మోడల్ స్కూల్స్, 11 కేజీబీవీలు ఉన్నట్లు వివరించారు. గురుకులాలు, జ్యోతిరావు పూలే పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు.
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ప్రతి నెల 1వ తేదీన తప్పనిసరిగా చెల్లించాలని చైర్మెన్ స్పష్టం చేశారు. పీఎఫ్, బీమా సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో 90,832 మంది ఎస్సీలు, 28,843 మంది ఎస్టీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ రైతులకు అందుతున్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, ఉపాధి హామీ పనులు, ఉచిత విద్యుత్ కనెక్షన్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాల నిర్మాణంపై కూడా ఆయన సమీక్షించారు. అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈ డీ అబ్దుల్ ఖలీల్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి శత్రు నాయక్, డిఆర్డిఓ వెంకట్ రాములు, డీఈవో గోవింద రాజులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, సీ పీ వో ఖాఘవాహన్, డీపిఆర్వో రషీద్, విద్యుత్ శాఖ ఎస్ ఈ నవీన్, అబ్కారీ శాఖ ఈఎస్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్ లు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

