• బీసీ కురవలు తమను మాదాసి కురవలుగా ప్రకటించుకోవడం అన్యాయం,అక్రమం
• కురవ పేరును బూచిగా చూపెట్టి ఎస్సీ సర్టిఫికెట్లను పొందడం చట్ట విరుద్ధం
• ఇదివరకు పొందిన మాదాసి కురువ సర్టిఫికెట్లను రద్దు చేయాలి
• దళిత ప్రజా సంఘాలు,MRPS,మాల మహానాడు, అంబేద్కర్ యువజన సంఘం,KNPS,మాదిగ జాగృతి సంఘం
నారాయణపేట, సెప్టెంబర్ 24,(జన ఉదయం ప్రతినిధి )
గత కొంత కాలంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బి.సి కురువలు తాము ఎస్సీ మాదాసి కురువలమని చెప్పుకుంటూ సర్టిఫికెట్లను పొందడం అనేది చట్ట విరుద్ధమని దీనివలన విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో నిజమైన ఎస్సీలకు జరుగుతున్న నష్టం దృష్ట్యా జాతీయ ఎస్సీ కమిషన్ ఆయా కలెక్టరేట్లకు ఎవరికి ఎస్సి మాదాసి కురువ సర్టిఫికెట్లు ఇవ్వోద్దని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో గురువారం ప్రజాసంఘాలుగా మక్తల్ మండల ఎమ్మార్వో సతీష్ కుమార్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
దళితుల్లా అంటరానితనము , సామాజిక వివక్షతను ఎదుర్కొనకపోయినా ఎస్సీ కులం సర్టిఫికెట్లకై బీ.సీ కురువ కులస్తులు తమ కులానికి ఎస్సీ జాబితాలోని 31వ మాదాసి కురువ కులానికి పేరులో ఉన్న పోలికను బూచిగా చూపుతు ఫోర్జరీలతో కోట్ల రూపాయల దందాలకు పాల్పడుతూ అధికారులను తప్పుదోవ పట్టిస్తుండటం అన్యాయం అక్రమం అన్నారు
దళిత బహుజనులు దేశవ్యాప్తంగా కులగనను చేపట్టి బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని చేస్తున్న ఉద్యమంలో బీసీ కురువలు భాగమై కొట్లాడకుండా కుట్రపూరితంగా సులభమైన పద్ధతితో దళితుల రిజర్వేషన్లను కొల్లగొట్టే పనికి పూనుకోవడం దుర్మార్గం అన్నారు.
నిజానికి 1957,1976 లలో చేసిన గణనల ద్వారా తెలంగాణ ప్రాంతంలో మాదాసి కురువ కులస్తులు లేరని ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగిందన్నారు.అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎస్సీ మాదాసి కురువలు లేరని అప్పటి జిల్లా కలెక్టర్గా పనిచేసిన టి.కే శ్రీదేవి ప్రభుత్వానికి రిపోర్ట్స్ పంపించిందన్నారు.
కావున జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాలనుసారం మరియు అప్పటి కలెక్టర్ టికే శ్రీదేవి ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అధికారులు ఎవరూ బీసీ కురువ కులస్తులకు ఎస్సీ మాదాసి కురువ పేరుతో ఎస్సీ సర్టిఫికెట్లను ఇవ్వొద్దన్నారు.అలాగే అధికారులతో కుమ్మక్కై,ఫోర్జరీలతో మాదాసి ఎస్సి సర్టిఫికెట్ పొందిన బీసీ కురువ కులస్తులను గుర్తించి వారి క్యాస్ట్ సర్టిఫికెట్స్ను చేయాలని లేని యెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్విరాజ్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నారాయణ, ఏంఆర్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి జగ్గలి అంజప్ప,మాదిగ జాగృతి సంఘం తిమ్మరాజు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
