– మున్సిపాలిటీ పాలకవర్గంలో brs ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోవడం తో అడ్డగోలు ఆరోపణలు
– అభివృద్ధి పనులు జరుగుతున్న దృశ్యాలను చూసి కూడా ఓర్వలేని తనం బిఆర్ఎస్ నాయకులది
– అవసరానికి పేదలకు ఉపాధి కల్పించడం తప్పా
– మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి గట్టిగా జవాబు ఇచ్చిన – మక్తల్ మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్స్
నారాయణపేట, అక్టోబర్ 8 (జన ఉదయం ప్రతినిధి)
మక్తల్ మున్సిపాలిటీ పాలకవర్గంపై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను మక్తల్ మున్సిపాలిటీ చైర్మన్ వాకిటి మానస హన్మంతు, వైస్ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు.
నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకుండానే నిధులు డ్రా చేశారని ఆరోపించడం పూర్తిగా అవాస్తవమని వారు స్పష్టం చేశారు.
ప్రతి వార్డులో రొటీన్ పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగానే సుమారు రూ.లక్ష మేరకు పనులు చేపట్టామని, అన్ని వార్డుల్లోనూ పారిశుద్ధ్య పనులు నిర్వహించామని తెలిపారు. మురుగు కాలువల్లో పూడికతీత, ముళ్లకంపలు తొలగించడం, చెత్తను తొలగించడం వంటి పనులను ప్రజల సమక్షంలోనే నిర్వహించామని పేర్కొన్నారు. అవసరమైతే ఆయా పనులకు సంబంధించిన ఫోటోలను కూడా ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అలాగే మున్సిపాలిటీలో 12 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందికి లక్షల రూపాయలు చెల్లించారన్న ఆరోపణ కూడా వాస్తవం కాదన్నారు. మక్తల్ మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ పోస్టులే లేవని, పారిశుద్ధ్య పనుల కోసం అవసరమైన సమయంలో 12 మంది డైలీ లేబర్లను రోజుకు రూ.400 చొప్పున కొన్ని రోజులకు మాత్రమే పనిలోకి తీసుకున్నామని వివరించారు. వారు పని చేసిన రోజులకు మాత్రమే కూలి చెల్లిస్తామని, పని చేయకపోతే ఎలాంటి చెల్లింపులు ఉండవని స్పష్టం చేశారు.
మురుగు కాలువలు, చెత్త తొలగించే పనులకు చాలామంది ముందుకు రాకపోవడంతో, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కొంతమంది మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో డైలీ లేబర్లుగా అవకాశం కల్పించామని తెలిపారు. అలాంటి వారికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించారనే ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమో మాజీ ఎమ్మెల్యే గారే ఆలోచించాలని అన్నారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి నాయకత్వంపై ఉన్న నమ్మకంతో 12 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిందనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం మక్తల్ మున్సిపాలిటీ గతంతో పోలిస్తే మరింత పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి వార్డు కౌన్సిలర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా పాలకవర్గం పనితీరును గమనిస్తూ తమకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని, రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారు నేర్పించిన క్రమశిక్షణ, ప్రజాసేవ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి ఒక్కటే — మక్తల్ పట్టణ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకరించండి. పాలకవర్గంపై నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని కోరుతున్నాము.
అదేవిధంగా, ఇతరులపై ఆరోపణలు చేసే ముందు గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన విషయాలను కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మక్తల్ ప్రజలకు ఎవరు ఎలా పనిచేశారో, ఎవరి పాలనలో ఏమి జరిగిందో పూర్తిగా తెలుసు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని అన్నారు.
రాజకీయ విమర్శలకు సమయం కేటాయించడం కంటే మక్తల్ పట్టణ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని మక్తల్ మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిల్ పేర్కొంది.
