ఉత్సాహంగా సాగిన అథ్లెటిక్స్ పోటీలు…

– మక్తల్‌లో లక్ష్య అథ్లెటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు

నారాయణపేట, సెప్టెంబర్ 13( జన ఉదయం ప్రతినిధి ):

మక్తల్ పట్టణంలోని లక్ష్య అథ్లెటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతోపాటు, అథ్లెటిక్స్‌లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు జగదీష్ కుమార్ తెలిపారు.

ఈ పోటీలను జిల్లా యువజన, క్రీడల అధికారి (DYSO) వెంకటేష్ శెట్టి, జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి రమణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఉన్నత స్థాయిలో శిక్షణ పొందేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కోచ్ జగదీష్ తన యొక్క ఎఫర్ట్స్ను క్రీడలపై పెడుతూ మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని ప్రతివను వెలికి తీయటలో తన వంతు ఎనలేని కృషి చేయడం అభినందనీయమని వారు కొనియాడారు.

అనంతరంకోచ్ జగదీశ్ మాట్లాడుతూ…

మక్తల్ పట్టణం, పరిసర ప్రాంతాల్లోని క్రీడా ఆణిముత్యాలను వెలికితీసి వారికి లక్ష్య అథ్లెటిక్స్ సెంటర్‌లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా అవసరమైన శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ఉద్యోగ నియామకాలలో 2 శాతం రిజర్వేషన్ కల్పించిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు వివిధ అథ్లెటిక్స్ విభాగాల్లో ఉత్సాహంగా పోటీపడ్డారు. విజేతలకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి రమేష్ రావు, అంబాదాస్, రమణ, పరంజ్యోతి, రాజేశ్వరి, సందీప్, భీమారెడ్డి, అంజి, రమేష్, హర్షవర్ధన్, వెంకటేష్‌తోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.