• పుష్పగుచ్ఛాలు అందజేసి మంత్రి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
• తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం, యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడమే ఈ పర్యటన
హైదరాబాద్, అక్టోబర్ 6 (జన ఉదయం ప్రతినిధి)
జపాన్ దేశ పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన సతీమణి వాకిటి లలితమ్మకు మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొందరు మక్తల్ మున్సిపల్ పాలకమండలి సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి మంత్రి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం, యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడం, మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆధునిక క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటించింది. ఆసియా క్రీడల నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న క్రీడా విధానాలు, క్రీడాకారుల ప్రోత్సాహానికి చేపడుతున్న కార్యక్రమాలు, శిక్షణా పద్ధతులు, క్రీడా వసతుల నిర్వహణను ప్రతినిధి బృందం పరిశీలించింది.
జపాన్‌లో విజయవంతమైన క్రీడా విధానాలను అధ్యయనం చేసి, వాటిలో తెలంగాణకు అనువైన అంశాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని నాయకులు తెలిపారు. రాష్ట్ర క్రీడాకారులకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి వాకిటి శ్రీహరి చేస్తున్న కృషిని వారు అభినందించారు.
విమానాశ్రయంలో మంత్రి దంపతులకు ఘన స్వాగతం లభించడంతో మక్తల్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. మంత్రి పర్యటన విజయవంతం కావడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జపాన్ పర్యటనలో తెలంగాణ క్రీడాభివృద్ధికి సంబంధించిన విధానాలపై అధ్యయనం చేసినట్లు తెలుస్తుంది.
పర్యటనలో ప్రధానంగా పరిశీలించిన అంశాలు….
– అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణ విధానం.
– ఆధునిక క్రీడా మైదానాలు, శిక్షణా కేంద్రాల నిర్మాణం.
– క్రీడాకారులకు అందించే వసతి, వైద్య, ఫిట్నెస్ సదుపాయాలు.
– ప్రతిభావంతులైన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ.
– క్రీడా మౌలిక వసతుల నిర్వహణలో జపాన్ అనుసరిస్తున్న విధానాలు.
– భవిష్యత్తులో తెలంగాణలో పెద్దస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలుస్తుంది .
ఈ పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేనారెడ్డి, వీసీ, ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.
