• మక్తల్లో విద్యుత్ పరికరాల చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలు
• నిర్వహణకు ఆటంకం.. ప్రమాదాలపై స్థానికుల ఆందోళన
• పరిసరాల శుభ్రత, రక్షణ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని వినతి
నారాయణపేట, అక్టోబర్ 15 (జన ఉదయం ప్రతినిధి )
విద్యుత్ సరఫరాలో కీలకమైన ట్రాన్స్ఫార్మర్ల పరిసరాలు ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోవడం మక్తల్ పట్టణంలో ఆందోళన కలిగిస్తోంది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ దట్టంగా మొక్కలు పెరిగినా వాటిని తొలగించే చర్యలు కనిపించడం లేదని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు . విద్యుత్ పరికరాల నిర్వహణతోపాటు పరిసరాల భద్రతపైనా అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల వద్దకు సులభంగా చేరుకోలేనంతగా పొదలు విస్తరిస్తున్నప్పటికీ వాటిని తొలగించాలన్న ఆలోచన విద్యుత్ అధికారులకు కానీ మున్సిపాలిటీ సిబ్బంది గాని లేకపోవడం శోచనీయమని ప్రజలు భావిస్తున్నారు . స్తంభాల చుట్టూ తీగజాతి మొక్కలు అల్లుకున్న దృశ్యాలూ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ పరికరాల వద్దకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని, సమస్య తలెత్తిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పరిసరాల నిర్వహణపై ప్రశ్నిస్తున్న ప్రజలు….
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు మరమ్మతులు చేపట్టాలన్నా, పరికరాలను పరిశీలించాలన్నా ట్రాన్స్ఫార్మర్ల పరిసరాలు అందుబాటులో ఉండాలి. అయితే ముళ్లపొదలు విస్తరించిన చోట్ల నిర్వహణ పనులకు ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొదల మధ్య విషసర్పాలు ఉండవచ్చనే భయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.
నివాస ప్రాంతాలు, ప్రజలు రాకపోకలు సాగించే ప్రదేశాలకు సమీపంలో ఉన్న విద్యుత్ పరికరాల వద్ద భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, పశువులు ట్రాన్స్ఫార్మర్ల సమీపానికి వెళ్లకుండా అవసరమైన రక్షణ ఏర్పాట్లు ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచిస్తున్నారు.
ప్రమాదం తర్వాత కాదు.. ముందే చర్యలు…
ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పెరిగిన మొక్కలను తొలగించడంతోనే సరిపెట్టకుండా, మళ్లీ అదే పరిస్థితి తలెత్తకుండా విద్యుత్తు అధికారులు లైన్మెన్లు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. పరికరాల స్థితి, పరిసరాల శుభ్రత, రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సంబంధిత విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని, స్థానిక సంస్థల సమన్వయంతో పొదల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేయకుండా ముందస్తు జాగ్రత్తలతో ప్రజల్లో భరోసా కల్పించాలన్నది స్థానికుల అభిప్రాయం.
