APSRTC: స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయాలు

APSRTC: స్త్రీ శక్తి పథకం వల్ల పెరిగిన రద్దీని తగ్గించేందుకు ఏపీఎస్ఆర్టీసీ కొత్త ఎలక్ట్రిక్, సీఎన్‌జీ బస్సులపై దృష్టి పెట్టింది.

APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అమలులో ఉన్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంను మరింత సౌకర్యవంతంగా రూపొందించేందుకు ఏపీఎస్ఆర్టీసీ పలు చర్యలు ప్రారంభించింది. ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణబాబు వెల్లడించారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ నిర్ణయాలను ప్రకటించారు.

స్త్రీ శక్తి పథకం ప్రారంభమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐదు రకాల బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండటంతో రోజువారీ ప్రయాణికుల రద్దీ కూడా అధికమైంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో సీట్ల కోసం పోటీలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మహిళలకు ఇబ్బందులు లేకుండా, సురక్షితంగా ప్రయాణం అందించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇటీవల ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణబాబు, ఆర్టీసీ పనితీరు, సమస్యలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ఈ ఏడాదిలో భాగంగా 2500 ఎలక్ట్రిక్ -సీఎన్‌జీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు కృష్ణబాబు వెల్లడించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందనున్న 1050 ఎలక్ట్రిక్ బస్సులను ఈ సంవత్సరం చివరి నాటికి రోడ్లపైకి తీసుకురానున్నారు. కాలం చెల్లిన బస్సులను దశలవారీగా తొలగించి, కొత్త బస్సులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల రద్దీ తగ్గి, మహిళలకు సీట్లు దొరికే అవకాశం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

అదనంగా, ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఎండీ తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్యలన్నీ కలిపి ప్రయాణికులకు సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *