Tummala: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సోమవారం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రయోజనాలు, రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా విభజన సమయంలో ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.
5 గ్రామాల విలీనంపై చర్చ
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు ముంపు దృష్ట్యా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే, భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, ఉష్ణ గుండాల అనే ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని మంత్రి తుమ్మల కోరారు. భద్రాచలం అభివృద్ధికి, పరిపాలనా సౌలభ్యానికి ఈ గ్రామాలు ఎంతో కీలకమని ఆయన ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు.
Tummala: తిరుమలలో తెలంగాణకు స్థలం
భక్తుల సౌకర్యార్థం తిరుమల శ్రీవారి సన్నిధిలో తెలంగాణ రాష్ట్రానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మంత్రి తుమ్మల కోరారు. దీనివల్ల తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడం సులభతరమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఖమ్మం నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. దీనిపై ఏపీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
సాగునీరు, రైల్వే ప్రాజెక్టుల పునరుద్ధరణ
ఖమ్మం జిల్లా పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చులో 85 శాతం నిధులను ఏపీ ప్రభుత్వం భరించాలని తుమ్మల ప్రతిపాదించారు. భద్రాచలం ముంపు నివారణకు నిర్మించిన కరకట్టలో ఏపీ పరిధిలోకి వచ్చే భూభాగానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. అలాగే సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-అమరావతి రైల్వే లైన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఏలూరు-కొత్తగూడెం జాతీయ రహదారి పనులపై చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
సానుకూల వాతావరణంలో భేటీ
Tummala: రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ భేటీ జరిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మంత్రి తుమ్మల చేసిన ప్రతిపాదనలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, అధికారులతో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీ ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
