–మ్యాపింగ్, హియరింగ్‌కు హాజరు కాలేని వారికి తదుపరి షెడ్యూల్‌లో అవకాశం
— జిల్లా కలెక్టర్ ప్రియాంక
నారాయణపేట,సెప్టెంబర్ 7( జన ఉదయం ప్రతినిధి )
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న మ్యాపింగ్, విచారణ (హియరింగ్) ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ప్రియాంక సోమవారం ఓ పత్రికా ప్రకటన లో స్పష్టం చేశారు.
అభ్యర్థి స్వయంగా హాజరు కాలేని పరిస్థితుల్లో, అభ్యర్థి తరఫున కుటుంబ సభ్యులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరై పత్రాలను సమర్పించవచ్చని ఆమె తెలిపారు. అభ్యర్థికి సంబంధించిన 11 ఆమోదయోగ్యమైన పత్రాల్లో, కేసు స్వభావాన్ని బట్టి అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
వయస్సు, జన్మతేదీ, మ్యాపింగ్‌కు సంబంధించిన అంశాలు లేదా ఇతర కారణాలతో విచారణకు హాజరు కావాల్సిన సందర్భాల్లో సంబంధిత పత్రాలను సమర్పించి తమ అభ్యర్థనను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
నోటీసు అందజేసే సమయంలో లేదా సంబంధిత పత్రాలను స్వీకరించే సమయంలో కూడా అభ్యర్థి లేదా వారి తరఫున హాజరైన కుటుంబ సభ్యుడి ఫోటోను అధికారులు అక్కడికక్కడే తీసుకుని రికార్డులో నమోదు చేస్తారని తెలిపారు. అభ్యర్థి స్వయంగా ఫోటో సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీ ఎల్ వో లు పై విషయాలను గుర్తు పెట్టుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్‌లో విచారణకు హాజరు కాలేకపోయిన వారికి కూడా మరో అవకాశం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. ఏదైనా కారణంతో హియరింగ్‌కు హాజరు కాలేకపోయిన కేసులను గుర్తించి, తదుపరి షెడ్యూల్‌లో తిరిగి విచారణకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మ్యాపింగ్‌కు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా తదుపరి తేదీలను నిర్ణయించి, అభ్యర్థులు లేదా వారి కుటుంబ సభ్యులు హాజరై అవసరమైన పత్రాలను సమర్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అభ్యర్థులు తమకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ నంబర్, తదుపరి విచారణ తేదీ తదితర వివరాలను సంబంధిత సూపర్ వైజర్, బూత్ స్థాయి అధికారి లేదా ఇతర సంబంధిత అధికారులను సంప్రదించి తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు.
హియరింగ్‌కు హాజరు కాలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తదుపరి షెడ్యూల్‌లో అవకాశం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ప్రియాంక స్పష్టం చేశారు. అర్హతను నిర్ధారించే సంబంధిత ధ్రువపత్రాలతో హాజరై ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులను ఆమె కోరారు.
