Bangladesh Elections: బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఘనవిజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 299 పార్లమెంట్ స్థానాలకు గాను, బిఎన్పి ఏకంగా 209 సీట్లను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, పార్టీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ దేశ తదుపరి ప్రధానమంత్రి కావడం దాదాపు ఖాయమైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బిఎన్పి మళ్లీ దేశ పగ్గాలను చేపట్టబోతోంది.
కూటమిని చిత్తు చేసిన బిఎన్పి
ఈ ఎన్నికల్లో జమాతే ఇ ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి బిఎన్పికి గట్టి పోటీ ఇస్తుందని భావించినప్పటికీ, ప్రజలు మార్పు వైపే మొగ్గు చూపారు. ఈ కూటమి ఇప్పటివరకు కేవలం 70 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. జమాతే చీఫ్ షఫీకర్ రెహమాన్ ఢాకా-15 స్థానం నుండి విజయం సాధించినప్పటికీ, ఆ కూటమి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అవామీ లీగ్ లేని ఈ ఎన్నికల్లో ప్రజలు బిఎన్పికి పట్టం కట్టడం గమనార్హం.
తారిఖ్ రెహమాన్: వనవాసం నుంచి పట్టాభిషేకం వరకు
బిఎన్పి అధినేత తారిఖ్ రెహమాన్ ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ ఘనవిజయం సాధించారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఎన్నో మలుపులతో కూడుకున్నది:
-
17 ఏళ్ల ప్రవాసం: 2008లో వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లిన తారిఖ్, అప్పటి ప్రభుత్వాల కేసుల వల్ల 17 ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయారు.
-
తిరిగి రాక: గతేడాది డిసెంబర్లో ఆయన తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. జనవరి 25న పూర్తిస్థాయిలో లండన్ వీడి బంగ్లాదేశ్ వచ్చారు.
-
నేతృత్వం: తారిఖ్ తిరిగి వచ్చిన ఐదు రోజులకే ఆయన తల్లి, మాజీ ప్రధాని ఖలీదా జియా అనారోగ్యంతో మరణించారు. దీంతో పార్టీ బాధ్యతలను ఆయన పూర్తిగా భుజానికెత్తుకున్నారు.
Bangladesh Elections: అవినీతి ఆరోపణలు.. నూతన ఆశలు
2001-2006 మధ్య కాలంలో బిఎన్పి అధికారంలో ఉన్నప్పుడు తారిఖ్ రెహమాన్ తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే, ఇప్పుడు ఆయన ఒక సరికొత్త నాయకుడిగా తనను తాను ఆవిష్కరించుకుంటున్నారు.
-
ప్రతి సంవత్సరం 50 మిలియన్ చెట్లను నాటడం.
-
ఢాకాలో గ్రీన్ జోన్ల ఏర్పాటు.
-
సాంకేతిక విద్యను గ్రామస్థాయికి తీసుకెళ్లడం. ఇలాంటి అంశాలపై ఆయన దృష్టి సారిస్తున్నారు. ఆయన ఒక ‘వినే నాయకుడిగా’ (Listener leader) పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
