రైతులు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు

• తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, నారాయణపేట సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ

• రైతులకు సహజ, సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ

నారాయణపేట, సెప్టెంబర్ 3 (జన ఉదయం ప్రతినిధి)

రైతులు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించడంతో పాటు భూసారాన్ని పరిరక్షించేందుకు సహజ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంబించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, నారాయణపేట సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ సూచించారు.
గురువారం ATMA సమన్వయంతో రైతులకు సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, భూసార ఆరోగ్య నిర్వహణ, పంటల వైవిధ్యీకరణ, నానో ఎరువుల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఈటెల సత్యనారాయణ రైతులకు భూసార పరీక్షల ప్రాధాన్యతను వివరించి, నేల అవసరాలకు అనుగుణంగా సమతుల్య ఎరువుల వినియోగం చేపట్టాలని సూచించారు. అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు, సహజ వ్యవసాయ పద్ధతులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. అలాగే తక్కువ నీటితో సాగు చేయగల పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల పంటలను ప్రోత్సహించడం ద్వారా పంటల వైవిధ్యీకరణ చేపట్టాలని సూచించారు. నానో ఎరువులను శాస్త్రీయ సూచనల మేరకు, సరైన మోతాదులో వినియోగిస్తే ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి (DAO) సాక్రియా నాయక్, DPD-ATMA శాంతి నిర్మల, వ్యవసాయ అధికారి (AO) బాల దినకర్, AEO అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *