• సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్
• మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల వైఖరికి నిదర్శనం
నారాయణపేట, సెప్టెంబర్ 7 (జన ఉదయం ప్రతినిధి )
కనీస వేతన సలహా బోర్డు నుంచి సిఐటియును మినహాయించడం దుర్మార్గమైన చర్య అంటూ సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవిందరావు తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఆయన మక్తల్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు మరో నిదర్శనం అన్నారు.
కేంద్ర కనీస వేతన సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణలో ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలైన సీఐటీయూ , ఏఐటీయూసీ , యన్ టీయూసీ లకు ప్రాతినిధ్యం నిరాకరించడాన్ని సీఐటీయూ నారాయణపేట జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించిందన్నారు . వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని, ఈ నిరసనలలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కార్మికుల కనీస వేతనాలు, జీవన ప్రమాణాలు, ఉపాధి పరిస్థితులకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై నిర్ణయాలు తీసుకునే కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయూ , ఏఐటీయూసీ , యన్ టీయూసీ వంటి దేశంలోని ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం పూర్తిగా అప్రజాస్వామికం, కక్షపూరితమైన చర్య అని విమర్శించిందన్నారు . 2026 జూలై 21న కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన కేంద్ర కనీస వేతన సలహా బోర్డు, వాస్తవానికి కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిన త్రైపాక్షిక వేదికగా ఉండాలి. అయితే ప్రధాన కార్మిక సంఘాలను పక్కన పెట్టి, తనకు అనుకూలమైన వారితో బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా కార్మికుల వేతనాలను అణచివేయడానికి, యజమానులకు అనుకూలమైన విధానాలను చట్టబద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
కార్పొరేట్ సంస్థలకు “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” పేరుతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ, కార్మికులకు మాత్రం “ఈజ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్” పరిస్థితులను మోదీ ప్రభుత్వం సృష్టిస్తోంది. కార్మిక కోడ్ల పేరుతో కార్మికుల హక్కులను హరించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కనీస వేతనాల నిర్ణయ ప్రక్రియలో కూడా కార్మిక సంఘాల గొంతును నొక్కివేయడానికి ప్రయత్నిస్తోంది.
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన ధరలు, విద్యుత్ చార్జీలు, వైద్యం, విద్య, ఇల్లు, రవాణా ఖర్చులు నిరంతరం పెరుగుతున్నప్పటికీ, కార్మికుల నిజమైన ఆదాయాలు మాత్రం పడిపోతున్నాయి. మరోవైపు కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు, పన్ను మినహాయింపులు, ప్రజా ఆస్తుల అప్పగింతలు కొనసాగుతున్నాయి. కార్మికుల కనీస వేతనాల నిర్ణయంలో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో ఏకాభిప్రాయంతో వచ్చిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. కార్మిక కుటుంబం గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమైన వేతనం లభించేలా కనీస వేతనాలను శాస్త్రీయంగా నిర్ణయించాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించాలి.
కానీ మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించి పరిష్కారం కనుగొనే బదులు, కార్మిక సంఘాల ప్రాతినిధ్యాన్ని తొలగించి ఏకపక్ష నిర్ణయాలకు మార్గం సుగమం చేస్తోంది. సీఐటీయూ ను కనీస వేతన సలహా బోర్డు నుంచి తప్పించడం ద్వారా దేశంలోని కోట్లాది కార్మికుల సమస్యలను, వారి హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని అణచివేయలేరని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ పోరాటం బోర్డుల్లోని ప్రాతినిధ్యంతో ప్రారంభమైందీ కాదు, ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆగేదీ కాదు. కర్మాగారాల్లో, నిర్మాణ రంగంలో, రవాణా రంగంలో, అసంఘటిత రంగంలో, స్కీమ్ వర్కర్లలో, గిగ్–ప్లాట్ఫామ్ కార్మికుల్లో, ప్రభుత్వ–ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కోట్లాది కార్మికులతో కలిసి సీఐటీయూ నిరంతరం పోరాడుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ కక్షపూరిత వైఖరిని తెలంగాణలోని కార్మికవర్గం, అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అసంఘటిత రంగ కార్మికులు ఐక్యంగా ఖండించాలని సీఐటీయూ నారాయణపేట జిల్లా కమిటీ కార్మికులకు పిలుపునిస్తున్నారు.
