– మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఇతర టిఆర్ఎస్ నాయకుల అరెస్ట్
– నర్వ పోలీస్ స్టేషన్ కు తరలింపు
– మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్టుపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు
నారాయణపేట, సెప్టెంబర్ 7 (జన ఉదయం ప్రతినిధి)
సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన నీరుగారిందని ఆరుగారెంటీలు అమలు కాలేదు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరిస్తూ నిరసనగా అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో అట్టి ఎమ్మెల్యేలను పోలీసుల అడ్డుకోవడం తోటి అసెంబ్లీ ముందు ఎమ్మెల్యేలకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ వద్ద జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం మక్తల్ పట్టణంలో 167వ జాతీయ రహదారి అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.
ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నర్వ పోలీస్ స్టేషన్కు తరలించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడం సిగ్గుచేటని, తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సాక్షిగా మహిళలను అవమానించేలా వ్యవహరించడాన్ని నిరసిస్తూ, రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనీ తీవ్రంగా ఆరోపించారు . ధర్నాను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటూనే మహిళలకు కనీస రక్షణ, గౌరవం కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో సాధారణ మహిళలకు రక్షణ లేకపోవడమే కాకుండా మాజీ మంత్రులు, మహిళా ప్రజాప్రతినిధులకు కనీస మర్యాద ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. అరెస్ట్ అయిన వారిలో చిన్న హన్మంతు, రామలింగం, మైపాల్ రెడ్డి, నరసింహారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.
