దళితవాడల పాఠశాలలపై వివక్షా నీడ

• రెండేళ్లుగా నిధులు, బియ్యం, మౌలిక వసతులు కరవు

• ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ప్రజా సంఘాల ఫిర్యాదు

నారాయణపేట, సెప్టెంబర్ 17(జన ఉదయం ప్రతినిధి )

దళితవాడల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. దళిత పిల్లల విద్యపై ఇంతటి నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు.
నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, సబ్‌ప్లాన్ నిధులు, దళితుల సంక్షేమం, హక్కులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్ పట్టణంలోని దళితవాడలు, బీసీ కాలనీలో కొనసాగుతున్న రెండు ప్రభుత్వ పాఠశాలల సమస్యలను ప్రజా సంఘాల నాయకులు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

పోరాట ఫలితంగా ఏర్పాటైన పాఠశాలలు…

దళితవాడల్లో నివసించే పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే విద్యనభ్యసించాలనే ఉద్దేశంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పోరాటం ఫలితంగా రెండేళ్ల క్రితం రెండు ఎంఫీపీఎస్ పాఠశాలలు మంజూరయ్యాయని నాయకులు తెలిపారు. మక్తల్ పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ కాలనీలో యూడైస్ నంబర్ 36334102590తో, బీసీ కాలనీలో యూడైస్ నంబర్ 36334102589తో ఈ పాఠశాలలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అయితే పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, నిర్వహణ నిధులు సమకూరలేదని వారు ఆరోపించారు. పాఠశాల అద్దె, నిర్వహణ ఖర్చులు, స్కూల్ గ్రాంట్లు, స్కావెంజర్ వేతనాలు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బియ్యం కోసం ఉపాధ్యాయుడి అవస్థలు…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉన్నప్పటికీ, ఈ రెండు పాఠశాలలకు అవసరమైన బియ్యం కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని నాయకులు తెలిపారు. విద్యార్థులకు భోజనం పెట్టాలనే ఉద్దేశంతో పాఠశాల ఉపాధ్యాయుడు ప్రతిరోజూ సమీపంలోని ఇతర పాఠశాలలకు వెళ్లి బియ్యం అడిగి తెస్తున్నారని చెప్పారు.
పాఠశాల ప్రారంభోత్సవం నుంచి వివిధ అవసరాల కోసం అయ్యే ఖర్చులను స్కావెంజర్లు, వంట సిబ్బంది తమ సొంత డబ్బులతో భరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు భోజనం, తాగునీరు, కనీస వసతులు కల్పించలేని పరిస్థితి నెలకొనడం ఆందోళనకరమని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు.

తాగునీరు కూడా లేని దుస్థితి…

విద్యార్థులకు కనీసం మంచినీటి వసతి కూడా అందుబాటులో లేదని ఫిర్యాదులో తెలిపారు. పాఠశాలల నిర్వహణకు సంబంధించిన సమస్యలపై జిల్లా విద్యాశాఖ అధికారికి పలుమార్లు విన్నవించినా స్పందన రాలేదని ఆరోపించారు.
దళితవాడల్లో కొనసాగుతున్న పాఠశాలల పట్ల జిల్లా విద్యాశాఖ కార్యాలయం వివక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నాయకులు తెలిపారు. ఇతర పాఠశాలలకు అందుతున్న ప్రాథమిక సదుపాయాలు ఈ పాఠశాలలకు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. పేద, దళిత కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుతున్నారనే కారణంతోనే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా అని ఆవేదన వ్యక్తం చేశారు.

సమగ్ర విచారణకు ఆదేశించాలి…

రెండు పాఠశాలలకు సంబంధించిన సమస్యలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కోరారు. పెండింగ్‌లో ఉన్న నిర్వహణ నిధులు, పాఠశాల అద్దె, స్కూల్ గ్రాంట్లు, స్కావెంజర్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులకు క్రమం తప్పకుండా బియ్యం సరఫరా చేయడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పాఠశాల భవనం, ఇతర మౌలిక వసతులు కల్పించాలని కోరారు. దళిత పిల్లలకు కూడా సమాన విద్యా హక్కు ఉందని, వారి విద్య పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

“దళిత పిల్లలంటే ఇంత నిర్లక్ష్యమా?

పాఠశాలలు మంజూరు చేయడం మాత్రమే కాకుండా, వాటికి అవసరమైన నిధులు, సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. విద్యార్థుల భవిష్యత్తుతో అధికారులు చెలగాటం ఆడకూడదు” అని ప్రజా సంఘాల నాయకులు అన్నారు.
పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కే. పృథ్వీరాజ్, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డేవిడ్ మహారాజ్, ఈశ్వర్, జేవీపీఎస్ నాయకుడు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.