…ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకం
-జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట, అక్టోబర్ 8 (జన ఉదయం ప్రతినిధి)
ప్రజలకు మెరుగైన సేవలందించడంలో పోలీస్–మీడియా సమన్వయం కీలకం అని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని శాసన్‌పల్లి రోడ్‌లో గల లక్ష్మి బ్యాంకెట్ హాల్‌లో గురువారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్, ప్రెస్ గెట్ టు గెదర్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖతో పాటు ప్రజలకు సేవలందించడంలో మీడియా కూడా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా, వాచ్‌డాగ్‌గా పనిచేస్తూ ప్రభుత్వ శాఖలు, అధికారులు ప్రజలకు అందించాల్సిన సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్తుందని పేర్కొన్నారు.
పోలీసులు, మీడియా మధ్య పరస్పర సహకారం, సమన్వయం ఎంతో అవసరమన్నారు. పోలీసు శాఖలో రోజువారీ విధుల్లో ఎదురయ్యే సమస్యలు, లోపాలను మీడియా నిర్మాణాత్మకంగా సూచించడం ద్వారా వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని, ఇందుకు మీడియా సహకారం అవసరమన్నారు.
ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంపొందించడంలో మీడియా పాత్ర ముఖ్యమైనదని ఎస్పీ అన్నారు. పోలీసులపై ప్రజలకు విశ్వాసం ఉన్నప్పుడే నేరాల నియంత్రణతో పాటు సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావడంలో ప్రజలు ముందుకు వస్తారని తెలిపారు. పోలీసు–ప్రజల మధ్య విశ్వాసం, సత్సంబంధాలను పెంపొందించేందుకు మీడియా వారధిగా పనిచేస్తోందన్నారు.
కరోనా సమయంలో పోలీసులతో పాటు వైద్యులు, మీడియా ప్రతినిధులు ప్రజలకు సేవలందించేందుకు ముందుండి పనిచేశారని ఎస్పీ గుర్తుచేశారు. మీడియా సేవలను కూడా అత్యవసర సేవల్లో భాగంగా గుర్తించిన పరిస్థితులను ఆయన ప్రస్తావించారు.
నారాయణపేట జిల్లాలో గత ఏడాది కాలంగా పోలీసు శాఖ చేపట్టిన కార్యక్రమాలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు. జిల్లా పోలీసు శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని తెలిపారు. పోలీసు శాఖ విజయాలు ఏ ఒక్కరి కృషి ఫలితం కాదని, ప్రతి ఒక్కరి సమష్టి కృషితోనే సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
పోలీసు శాఖకు మీడియా అందిస్తున్న సహకారానికి ఎస్పీ డాక్టర్ వినీత్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే విధమైన సహకారం, సమన్వయంతో పనిచేస్తూ నారాయణపేట జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కలిసి ముందుకు సాగుదామని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేశ్, డీ పీ ఆర్ వో రషీద్, వివిధ జర్నలిస్టు సంఘాల సభ్యులు, ప్రింట్/ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు , ఎస్ఐ వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.
