వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తాం

మైనారిటీ సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మైనారిటీలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. భారతరత్న మౌలానా అబుల్ కలామ్ అజాద్ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘దేశభక్తికి చిరునామా మౌలానా అబుల్ కలామ్ అజాద్. ఆయన దేశంలో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికారు. దేశ మొదటి విద్యా శాఖా మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. 1951లో మొదటిగా ఐఐటీ స్థాపించారు. అజాద్ స్పూర్తితో విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నాం. టీడీపీ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ వర్సిటీ పెట్టాం. రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో ఏర్పాటు చేశాం. ఒకప్పుడు మైనారిటీ సోదరులు మక్కాకు వెళ్లేందుకు బెంగుళూరు, ముంబయి వెళ్లేవారు. హైదరాబాద్ లో అసెంబ్లీకి ఎదురుగా హజ్ హౌస్ కట్టి అక్కడి నుంచి  విమానంలో మక్కా పంపాం. మైనారిటీ ఫైన్సాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ ఏర్పాటు ఘనత టీడీపీదే. ఆనాడు దూరదృష్టితో హైదరాబాద్ అభివృద్ధికి తీసుకున్న చర్యలతో చాలా మంది ముస్లింలు లబ్ధి పొందారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

*సంక్షేమంలో మైనారిటీలకు ప్రాధాన్యత*

2025-26 బడ్జెట్ లో మైనారిటీల సంక్షేమానికి రూ.రూ.5,434 కోట్లు కేటాయించాం. ఎన్నికల్లో హామీ మేరకు సూపర్ సిక్స్ అమలు చేశాం. మైనారిటీలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తున్నాం. మైనారిటీ విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చాం. 175 మందిని DSC ద్వారా ఉర్దూ ఉపాధ్యాయులుగా నియమించాం. పీఎం వికాస్ పథకం కింద రూ.11 కోట్లతో 1,500 మందికి నైపుణ్య శిక్షణ ప్రారంభించాం. రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి మైనారిటీ ఆడపిల్లలకు ఇంటర్ వరకూ ఉచితంగా చదివిస్తున్నాం. ఇమామ్‌లకు రూ.10,000, మౌజన్లకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. హజ్ యాత్రికుల కోసం ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో నిలిచిన వెయ్యికి పైగా మసీదులు, చర్చి, షాదీఖానాలు, కమ్యూనిటీ హాళ్లనిర్మాణం, పునరుద్ధరణకు రూ.200 కోట్లు మంజూరు చేస్తాం. వక్ఫ్ ఆస్తులను రక్షిస్తున్నాం. అర్హత కలిగిన ఇమామ్ లందరినీ ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తాం. నూర్ బాషా కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు ఖర్చు చేస్తాం’ అని సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *