Ajit Pawar:మహారాష్ట్ర రాజకీయ ధృవతార, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన బారామతిలో అశ్రునయనాల మధ్య ముగిశాయి. బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించిన ఆయన భౌతికకాయానికి కటేవాడిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అజిత్ పవార్ కుమారులు పార్థ్, జే పవార్ తమ తండ్రి చితికి నిప్పంటించారు.
Ajit Pawar: కన్నీటి పర్యంతమైన కుటుంబం – రాజకీయ ప్రముఖుల నివాళులు
అజిత్ పవార్ అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని “అజిత్ దాదా అమర్ రహే” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పవార్ కుటుంబ సభ్యులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
-
కుటుంబ సభ్యులు: అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, కుమారులు పార్థ్, జే పవార్‌లతో పాటు ఆయన బాబాయ్ శరద్ పవార్, సోదరి సుప్రియా సులే కన్నీటి పర్యంతమయ్యారు.
-
ప్రముఖులు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ మంత్రి నారా లోకేష్, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తదితరులు హాజరై నివాళులర్పించారు.
ప్రమాదం ఎలా జరిగింది?
Ajit Pawar:జనవరి 28, బుధవారం ఉదయం 8:45 గంటల ప్రాంతంలో ముంబై నుండి బారామతికి వస్తున్న చార్టర్డ్ విమానం (లేర్ జెట్ 45) విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం పవార్ బారామతికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రన్ వేకు కేవలం 200 మీటర్ల దూరంలోనే విమానం విఫలమై మంటల్లో చిక్కుకుంది.
ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు పైలట్లు (కెప్టెన్ సుమిత్ కపూర్, శాంభవి పాఠక్), భద్రతా సిబ్బంది విదిప్ జాదవ్, విమాన సహాయకురాలు పింకీ మాలి మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మూడు రోజుల రాష్ట్ర సంతాపం
అజిత్ పవార్ అకాల మరణానికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు (జనవరి 28 నుండి 30 వరకు) రాష్ట్ర సంతాప దినాలను ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను సగం వరకు దించారు. ఆరు సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పవార్ మృతి మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
