IND vs PAK: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం రాత్రి 7:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఘనవిజయాలు సాధించి మంచి జోరు మీద ఉండగా, పాకిస్తాన్ కూడా తమ గత విజయాలతో ధీమాగా ఉంది.
రికార్డుల పరంగా భారత్ దే పైచేయి టీ20 ప్రపంచకప్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తోంది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు 8 సార్లు ముఖాముఖి తలపడగా, భారత్ ఏకంగా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాకిస్తాన్ కేవలం ఒకే ఒక్కసారి (2021లో) మాత్రమే గెలిచింది. ఓవరాల్ టీ20 రికార్డుల్లో కూడా భారత్ 13-3తో ముందంజలో ఉంది.
IND vs PAK: గత ఎనిమిది ఎన్‌కౌంటర్ల విశ్లేషణ:
-
2007: తొలి ప్రపంచకప్‌లో రెండుసార్లు తలపడ్డాయి. గ్రూప్ దశలో బౌల్-అవుట్ ద్వారా, ఫైనల్లో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.
-
2012 & 2014: ఈ రెండు టోర్నీల్లోనూ భారత్ ఏకపక్షంగా పాకిస్తాన్‌ను ఓడించి తన జైత్రయాత్రను కొనసాగించింది.
-
2016: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన వర్షం ప్రభావిత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించాడు.
-
2021: దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలిచి, ప్రపంచకప్‌లో భారత్‌పై తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.
-
2022: మెల్‌బోర్న్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటంతో భారత్ చివరి బంతికి విజయం సాధించింది.
-
2024: న్యూయార్క్‌లో జరిగిన లో-స్కోరింగ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించి 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నారు.
నేటి మ్యాచ్‌లో కీలకం కానున్న స్పిన్నర్లు కొలంబో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. భారత జట్టులో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వంటి మేటి స్పిన్నర్లు ఉండగా, పాకిస్తాన్ తరపున షాదాబ్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ కీలకం కానుంది. ముఖ్యంగా పాక్ స్పిన్నర్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై చర్చ నడుస్తున్న తరుణంలో, భారత బ్యాటర్లు అతడిని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.
వరుణుడి ముప్పు క్రికెట్ అభిమానులను కలవరపెడుతున్న ఏకైక అంశం వర్షం. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, మ్యాచ్ సమయంలో కొలంబోలో వర్షం కురిసే అవకాశం 50-60 శాతం వరకు ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు పాయింట్లు పంచుతారు. అయితే, పూర్తి స్థాయిలో మ్యాచ్ జరిగి భారత్ తన 8వ విజయాన్ని నమోదు చేయాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.
