Android: ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరోసారి భారీ సైబర్ ముప్పు తలెత్తింది. తాజాగా గుర్తించిన కొత్త బ్యాంకింగ్ ట్రోజన్ ‘స్టర్నస్’ (Sturnus) అనేది స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సైబర్ సెక్యూరిటీ నిపుణుల తాజా హెచ్చరికల ప్రకారం, ఈ మాల్వేర్ బ్యాంకింగ్ యాప్‌లతో పాటు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ చాట్ అప్లికేషన్‌లను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. దీనివల్ల వినియోగదారుల ఆర్థిక, వ్యక్తిగత సమాచారానికి తీవ్రమైన ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.
Android: థ్రెట్ ఫాబ్రిక్, MTI సెక్యూరిటీ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం, స్టర్నస్ మాల్వేర్ ప్రధానంగా నకిలీ బ్యాంకింగ్ లాగిన్ పేజీలను సృష్టించడం ద్వారా యూజర్ క్రెడెన్షియల్స్‌ను దొంగిలిస్తుంది. వినియోగదారులు తమ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ నమోదు చేసిన వెంటనే ఆ సమాచారం నేరుగా హ్యాకర్ల సర్వర్లకు వెళ్లిపోతుంది. అంతేకాదు, ఈ మాల్వేర్‌లో విస్తృతమైన రిమోట్ యాక్సెస్ సామర్థ్యం ఉంది. దాడి చేసేవారు యూజర్ ఫోన్‌లో జరిగే ప్రతి చర్యను ప్రత్యక్షంగా పర్యవేక్షించగలరు. స్క్రీన్‌ను బ్లాక్ చేసి నేపథ్యంలో మోసపూరిత లావాదేవీలను కూడా అమలు చేయగలదు.
Android: మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే—ఈ మాల్వేర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కూడా పక్కనబెట్టగలదు. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లలో సందేశాలు డీక్రిప్ట్ అయ్యి స్క్రీన్‌పై కనిపించే క్షణంలోనే వాటిని స్క్రీన్ క్యాప్చర్ ద్వారా చదివేస్తుంది. ఈ విధానం కారణంగా, ఎన్క్రిప్షన్‌ను బ్రేక్ చేయకుండానే చాట్ కంటెంట్‌ను హ్యాకర్లు చూడగలగటం చాలా పెద్ద భద్రతా లోపంగా గుర్తిస్తున్నారు నిపుణులు.
స్టర్నస్ మాల్వేర్ తొలి బాధితులు దక్షిణ మధ్య యూరప్ ప్రాంతాల్లో ఉన్నట్లు సైబర్ పరిశోధకులు గుర్తించారు. ఈ మాల్వేర్ అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, ఇప్పటికే దాని ప్రభావం గణనీయంగా కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు కేవలం కొంతమంది వినియోగదారులు మాత్రమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, ఇలా చిన్న చిన్న దాడులు భవిష్యత్తులో పెద్ద ఎత్తున సైబర్ దాడికి నాంది కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ముప్పును పూర్తిగా అరికట్టేందుకు గూగుల్ ప్రత్యేక భద్రతా ప్యాచ్‌ను విడుదల చేయలేదు. అందువల్ల యూజర్లు అపరిచిత సోర్స్‌ల నుంచి యాప్‌లు ఇన్‌స్టాల్ చేయకూడదు, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. బ్యాంకింగ్ యాప్‌లకు సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాలు పాటించడం కూడా అత్యవసరం.
