Sindhu River: సిందూ జలాల ఒప్పందం (ఇండస్ వాటర్ ట్రీటీ – IWT)కు సంబంధించి అంతర్జాతీయ న్యాయ ప్రక్రియలపై భారత్ స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. ఒప్పందం కింద ఏర్పడిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (CoA) ఇచ్చిన ఆదేశాలను తాము గుర్తించబోమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం న్యూఢిల్లీలో ప్రభుత్వ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
Sindhu River: ఇండస్ వాటర్ ట్రీటీ కింద జరుగుతున్న విచారణలు, పత్రాల సమర్పణకు సంబంధించిన ఆదేశాలు చట్టబద్ధం కావని భారత్ తేల్చి చెప్పింది. ఇటీవల కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, భారత జలవిద్యుత్ ప్రాజెక్టుల నుంచి ‘పాండేజ్ లాగ్‌బుక్స్’ను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఫిబ్రవరి 2 మరియు 3 తేదీల్లో విచారణలు నిర్వహించేందుకు కోర్ట్ నిర్ణయించింది. అయితే భారత్ ఈ విచారణలకు హాజరు కాలేదని, ఎటువంటి ప్రతివాదనలు కూడా దాఖలు చేయలేదని అంతర్జాతీయ న్యాయస్థానం వెల్లడించింది.
భారత ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వ్యవస్థే చట్టవిరుద్ధంగా ఏర్పడిందని భారత్ భావిస్తోంది. అందుకే ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియను భారత్‌పై ఒత్తిడి తెచ్చి చర్చలకు లాగేందుకు పాకిస్థాన్ అమలు చేస్తున్న వ్యూహంగా కేంద్రం భావిస్తోంది.
గత ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ దాడికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులే కారణమని భారత్ ఆరోపించింది. దానికి ప్రతీకారంగా మరుసటి రోజే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరింది.
Sindhu River: ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రభుత్వ విధానంగా మార్చుకుందని భారత్ ఆరోపిస్తూ ఒప్పందాన్ని కొనసాగించలేమని ప్రకటించింది. ఈ నిర్ణయంపై స్పందించిన పాకిస్థాన్, అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితికి లేఖలు రాయడం, ప్రపంచ దేశాలకు ప్రతినిధులను పంపడం, పదికి పైగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టింది.
పాకిస్థాన్ వ్యవసాయం ఎక్కువగా సింధు నది వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. దేశ వ్యవసాయ అవసరాల్లో 80 నుంచి 90 శాతం వరకు ఈ నీటిపైనే ఆధారమని అంచనాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ వద్ద ఉన్న నీటి నిల్వలు కేవలం నెల రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతున్నాయి. తార్బేలా, మంగల వంటి ప్రధాన రిజర్వాయర్లు దాదాపు ఖాళీగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాకిస్థాన్ నీటి సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయి.
ఒకప్పుడు కేవలం సాంకేతిక ఒప్పందంగా ఉన్న సింధు జలాల ఒప్పందం ఇప్పుడు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ఒత్తిడి కేంద్రంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
