Pawan Kalyan: అందరి చిట్టా నా దగ్గర ఉంది.. జనసేన నేతలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

Pawan Kalyan: మంగళగిరిలో జరిగిన జనసేన సర్వసభ్య సమావేశంలో పవన్ కల్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుంచి అసహనంతో వెళ్లిపోయారు.

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం మంగళగిరిలో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో సొంత పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో నిర్వహించిన ఈ భేటీలో.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంపై ఆయన సీరియస్ అయ్యారు. “రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు?” అని ప్రశ్నిస్తూ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Pawan Kalyan: “నేనే అంతా మాట్లాడాలా?” – లడ్డూ వివాదంపై అసహనం

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ నేతృత్వంలోని సిట్ (SIT) కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో.. వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో జనసేన నేతలు విఫలమవుతున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారానికి దీటుగా కౌంటర్ ఇవ్వడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

“అన్నింటికీ నేనే సమాధానం చెప్పాలా? అలాంటప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎందుకు ఉన్నట్లు? సనాతన ధర్మంపై, మన ప్రభుత్వంపై వైసీపీ బురద చల్లుతుంటే ఖండించే సాహసం ఎందుకు చేయడం లేదు?” అని నేతలను నిలదీశారు.

అరవ శ్రీధర్ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు

Pawan Kalyan:ఇక రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల అంశాన్ని పవన్ అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని చేసిన ఆరోపణలు, వైరల్ అవుతున్న వీడియోల వల్ల పార్టీ పరువు పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రతి ఒక్కరి చిట్టా నా దగ్గర ఉంది.. తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలేది లేదు” అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని వేసినట్లు గుర్తు చేస్తూ, వారం రోజుల్లోగా ఎమ్మెల్యే కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

నేతలకు షాక్ ట్రీట్‌మెంట్

Pawan Kalyan: సమావేశం మధ్యలోనే పవన్ కల్యాణ్ అసహనంతో బయటకు వెళ్లిపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వెళ్లే ముందు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరు, సోషల్ మీడియాలో వారి స్పందన, ప్రజా సమస్యల పరిష్కారంలో వారి చొరవపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మార్చి 14 (పార్టీ ఆవిర్భావ దినోత్సవం) లోపు పూర్తి చేయాలని, పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *