జనసేనలో కీలక నియామకం… దేవరకొండ కో-ఆర్డినేటర్‌గా డా. మణికంఠ గౌడ్

• హర్షం వ్యక్తం చేసిన మక్తల్ నియోజకవర్గ జనసైనికులు

నల్గొండ/దేవరకొండ, సెప్టెంబర్ 26( జన ఉదయం ప్రతినిధి)

ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి దృష్టి సారించింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా డా. మణికంఠ గౌడ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నియామకంపై స్థానిక జనసైనికులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, దేవరకొండ నియోజకవర్గంలో జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత చేరువ చేస్తామని డా. మణికంఠ గౌడ్ తెలిపారు.

పవన్ కళ్యాణ్‌పై నమ్మకం, పార్టీపై ప్రేమ…

ఈ సందర్భంగా డా. మణికంఠ గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. “పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో నేను పనిచేస్తాను. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో, అంకితభావంతో నిర్వర్తిస్తాను” అని ఆయన అన్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో యువత, విద్యావంతులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజల సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువెళ్తూ, జనసేన సిద్ధాంతాలైన సామాజిక చైతన్యం, మతరహిత రాజకీయాలు, భాషా సంస్కృతి పరిరక్షణ వంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తానని డా. మణికంఠ గౌడ్ పేర్కొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి….

త్వరలో జరగబోయే ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని డా. మణికంఠ గౌడ్ హామీ ఇచ్చారు. “ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ, పట్టభద్రులను, యువతను, మేధావులను జనసేన వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాను. మా పార్టీ అభ్యర్థి గెలుపుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటాను” అని ఆయన స్పష్టం చేశారు.
జనసేన పార్టీ తెలంగాణలో తొలిసారిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం. ఈ ఎన్నికల ద్వారా పార్టీ ఓటు బ్యాంక్‌ను పెంచుకోవడంతో పాటు, భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోకి బలమైన పునాది వేసుకోవాలని తమ అధిష్టానం భావిస్తోందని మణికంఠ గుడి తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.