– రూ.40 వేల పెట్టుబడి పెట్టి నష్టపోతున్నా మన్న రైతు శివకుమార్
– శివకుమారుని రైతు కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు
– ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
నారాయణపేట, సెప్టెంబర్ 3 (జన ఉదయం ప్రతినిధి )
మక్తల్ మండలం పరిధిలోని నారాయణపేట రోడ్డులో శివకుమార్ అనే రైతు సాగు చేసిన మూడు ఎకరాల వరి పంట వర్షాలు లేక ఎండిపోతుండటంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పంట సాగు కోసం పెట్టుబడులు పెట్టి, అప్పులు చేసి వ్యవసాయం చేపట్టినప్పటికీ, సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పొలంలో పంట వాడిపోతున్న పరిస్థితి నెలకొంది.
వరి మొక్కలకు అవసరమైన నీరు అందక ఆకులు ఎండిపోతున్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు, పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటపై ఆధారపడి జీవించే కుటుంబానికి వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు కావడంతో, ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, అప్పుల చెల్లింపులు భారంగా మారాయని తెలిపారు.
ఒకే ఒక్కసారి కి రూ.40 వేల ఖర్చు….
మూడు ఎకరాల్లో వేసినటువంటి వరి పంట కారణంగా అట్టి పంటకు ఎరువులు కలుపు తీయడం వంటి ఒకేసారి చేయడం తోటి దాదాపు రూ. 40 వేలు ఖర్చు వరకు వచ్చిందని రైతు శివకుమార్ తెలియజేశారు. రెండవసారి ఎరువులు అలాగే కలుపు తీసి ఉంటే దాదాపు 80 వేల వరకు ఖర్చు వచ్చిందని రైతు తెలిపారు.
వర్షాభావం కారణంగా పంట నష్టాన్ని అధికారులు వెంటనే పరిశీలించి, నష్టపరిహారం అందించాలని రైతు కుటుంబం కోరుతోంది. అదేవిధంగా సాగునీటి సౌకర్యం కల్పించి, పంటలను కాపాడేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేసి, అర్హులైన రైతులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించాలని వారు కోరుతున్నారు.
