ఢిల్లీ, ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహ్మద్ తొలి ఫోటో విడుదలైంది. అయితే ఈ పేలుడులో అతను మరణించాడా లేదా పరారీలో ఉన్నాడా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. ఇది ఆత్మాహుతి దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
ఎర్ర కోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన, హుండాయ్ i20 కారు వల్ల జరిగినట్లుగా గుర్తించారు. ఆ సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పేలుడు పదార్థంలో అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్,ఇంధన నూనె మరియు ఇతర పేలుడు పదార్థాలు మిశ్రమంగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలు ఫరీదాబాద్‌లోని ఒక కాశ్మీరీ వైద్యుడు అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్ నుండి దాదాపు 360 కిలోల అనుమానిత అమ్మోనియం నైట్రేట్, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు సంభవించింది. ఇకపోతే ఇటీవలే దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంట్లో భారీగా ఆయుధాలు…పేలుడు పదార్థాలను భద్రతా సంస్థలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వైద్యుడి ఇంట్లో నుంచి 300 కేజీల పేలుడు పదార్థాలను, ఏకే 47, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.ఢిల్లీ లేదా ఉత్తర భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పెద్ద ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఇలాంటి సందర్భంలో పేలుడు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
