ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ దుర్ఘటన వల్ల మరణించినవారి సంఖ్య 12కు చేరుకుంది. మరోవైపు, ఈ భారీ పేలుడుపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి భద్రతా సమావేశం జరిగింది. అలాగే పేలుడు వల్ల మరణించినవారికి సుప్రీంకోర్టు నివాళులర్పించింది.
దిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. సోమవారం జరిగిన ఈ పేలుడులో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు చనిపోయారు. దీంతో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12కి చేరుకుందని దిల్లీ పోలీసులు తెలిపారు. మరికొందరు క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
భారీ పేలుడుతో దేశ రాజధాని దిల్లీ ఉక్కిరిబిక్కిరైన వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని నిర్వహించారు. మంగళవారం కర్తవ్యభవన్లో జరిగిన ఈ భేటీకి హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, దిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ హాజరయ్యారు. జమ్ముకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ వర్చువల్ గా పాల్గొన్నారు. దిల్లీ పేలుడు, ఉగ్ర కుట్రలు, కశ్మీర్ ఘటనలపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో భద్రతా పరిస్థితిని సమీక్షించారని పేర్కొన్నాయి.
