Bullet Train: భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతోంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య 508 కి.మీ హై-స్పీడ్ రైలు కారిడార్ ఇప్పుడు కీలక దశలోకి ప్రవేశించింది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం 55 శాతం దాటింది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక, దేశంలో హై-స్పీడ్ రైలు యుగం అధికారికంగా ప్రారంభమవుతుంది.
Bullet Train: రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం, కారిడార్ పూర్తిగా సిద్ధమైతే ముంబై నుండి అహ్మదాబాద్ వరకు ప్రయాణ సమయం కేవలం 1 గంట 58 నిమిషాలకు తగ్గనుంది. ప్రస్తుతం ఈ ప్రయాణం సాధారణ రైళ్లలో 6 గంటలకు పైగానే పడుతుంది.
అదే సమయంలో, 2027 ఆగస్టులో తొలి అధికారిక ఆపరేషనల్ రన్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొదటి దశలో ఈ హై-స్పీడ్ రైలు సూరత్-వాపి మధ్య 100 కి.మీ స్ట్రెచ్‌పై ప్రయాణం ఉంటుంది. ఈ మార్గం పరీక్షా ప్రయాణానికి అనుకూలమని అధికారులు తెలిపారు.
MoSPI సమాచారం ప్రకారం, బుల్లెట్ రైలు ప్రాజెక్టు PAIMANA పోర్టల్ ద్వారా నిత్యం పర్యవేక్షణలో ఉంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై రూ.82,968 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ప్రాజెక్టు మొత్త ఖర్చు పూర్తయ్యే సమయానికి సుమారు రూ.1.08 లక్షల కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భారతదేశ రవాణా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. హై-స్పీడ్ ట్రావెల్, వేగవంతమైన కనెక్టివిటీతో పాటు నూతన సాంకేతికతలకు కూడా ఇది నాంది కానుందని నిపుణులు భావిస్తున్నారు.
