Road Accident: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా ఆరబోసిన వరికుప్పల కారణంగా ఇద్దరు చిరకాల స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. వయసుతోపాటు జీవిత పర్యాయం దాటినా, వారి స్నేహం మాత్రం ఏనాడూ విడిపోలేదు. ప్రతిరోజూ ఆప్యాయంగా పలకరించుకునే ఆ ఇద్దరు స్నేహితులు అనుకోని రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణంలోనూ వీడని వారి స్నేహం గ్రామాల్లో విషాదం నింపింది.
Road Accident: ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామ శివారులో జరిగింది. ఆ ప్రాంతంలో కొందరు రైతులు రహదారిపైనే సగభాగం మొత్తం వరి ధాన్యం ఆరపోశారు. ఎదురుగా వచ్చే వాహనాలు క్రాస్ అయ్యే అవకాశం కూడా లేకుండా వరికుప్పలు విస్తరించడంతో దారి బ్లాక్ అయింది. ఈ సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు వరికుప్పలు తప్పించబోయే క్రమంలో ఎదురుగా వచ్చిన DCM వాహనం ఢీకొనడంతో ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఒకరు ఉడుతగూడెం గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి, మరొకరు ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన చిన్నయ్యాకూబ్గా గుర్తించారు. వీరిద్దరి వయసు 60 ఏళ్లకు పైగానే ఉంది. చిన్నతనం నుంచే విడిపోని స్నేహం ఉన్న వీరు వ్యక్తిగత పనిమీద పెద్దపెండ్యాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
వారి మరణం రెండు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు, వాహనదారులు రోడ్డుపై నిర్లక్ష్యంగా ధాన్యం ఆరబోసే విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా వరికుప్పల కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగినప్పటికీ, అలవాటు మారడం లేదని వారు మండిపడుతున్నారు. రహదారులపై ధాన్యం ఆరబోసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇలాంటి ఘటనలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇకపై ఇలాంటి విషాదాలు మరల జరగకుండా రైతులు, వాహనదారులు, స్థానికులు తగిన జాగ్రత్తలు పాటించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
