• 11 ఏళ్లుగా మట్టి వినాయకుడినే ప్రతిష్ఠిస్తున్న గ్రామస్తులు
• గోలపల్లి గ్రామస్తులను అభినందించిన పలు హిందూ ధార్మిక సంస్థలు
నారాయణపేట, సెప్టెంబర్ 14 (జన ఉదయం ప్రతినిధి )
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గోల పల్లి గ్రామ ఆంజనేయ స్వామి యూత్ సభ్యులు,ప్రజలు వినూత్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా గత 11 ఏళ్లుగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దూరంగా ఉంటూ, మట్టి వినాయక విగ్రహాన్నే ప్రతిష్ఠిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆంజనేయ స్వామి యూత్ సభ్యులు .
మట్టి వినాయకుడి ప్రతిష్ఠాపనతో పాటు నిమజ్జనం సమయంలో చెరువులు, నదులు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలను ఉపయోగించకుండా భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
ప్రతి ఏడాది గ్రామస్తులంతా కలిసి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ విధానం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఇతర గ్రామాలకు కూడా గోల పల్లి ఆదర్శంగా నిలుస్తోందని గ్రామస్తులు తెలిపారు.
పర్యావరణ హితమైన వినాయక చవితిని నిర్వహిస్తూ 11 ఏళ్లుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గోల పల్లి గ్రామ ప్రజలను పలువురు అభినందిస్తున్నారు.
