—ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి ఆవాసంలో తాగునీటి వనరుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.
—-నవంబర్ 1 నుంచి గ్రామాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించాలి.
—–మండల స్థాయి సమావేశాలు నిర్వహించి, సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి
—-జిల్లా కలెక్టర్ ప్రియాంక
నారాయణపేట, అక్టోబర్ 23 (జన ఉదయం ప్రతినిధి)
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని మండలాల ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తాగునీటి సరఫరా, నీటి వనరుల స్థితిగతులు, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు, వేసవి కార్యాచరణ ప్రణాళికపై ఆమె సమీక్షించి దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన మెమో మేరకు నవంబర్ 1వ తేదీ నుంచి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని ఆవాసాలను సందర్శించి తాగునీటి వనరుల పరిస్థితిని అంచనా వేయాలని కలెక్టర్ సూచించారు. డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ప్రతి ఆవాసంలో నీటి లభ్యత, భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశాలు, నీటి వనరుల స్థిరత్వం, తక్షణమే చేపట్టాల్సిన పనులను గుర్తించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.
గ్రామాల్లోని చేతిపంపులు, సింగిల్ఫేజ్, త్రీఫేజ్ మోటార్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పైప్లైన్లు, కుళాయిల వద్ద లీకేజీలను గుర్తించి వెంటనే అరికట్టాలని, ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల (ఓహెచ్ఎస్ఆర్) శుభ్రత, నిర్వహణ, ట్యాంకుల మూతలు, వాటికి వెళ్లే మెట్ల భద్రతను పరిశీలించాలని సూచించారు. తాగునీటి సరఫరాలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు బ్లీచింగ్ పౌడర్ నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ప్రతి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్న వాటర్ ట్యాంకర్ల సంఖ్య, అత్యవసర పరిస్థితుల్లో వాటిని సమకూర్చుకునే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, గృహాలకు అందుతున్న నీటి సరఫరా, నిర్వహణ రిజిస్టర్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎంపీడీవోలు, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, ఏఈలు, ఎంపీఓలు, సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఈ సమావేశాల్లో పాల్గొనాలని, సమావేశాల షెడ్యూల్ను ముందుగానే రూపొందించి అందరికీ తెలియజేయాలని పేర్కొన్నారు. సమావేశాల్లో చర్చించిన అంశాలను మినిట్స్ రూపంలో నమోదు చేసి సంబంధిత అధికారుల సంతకాలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి ఆవాసాన్ని సందర్శించే బృందాలు అక్కడి తాగునీటి సమస్యలను గుర్తించడంతోపాటు, ప్రస్తుతం నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రానున్న నెలల్లో నీటి వనరులు ఎండిపోయే ప్రమాదం ఉందా అనే అంశాన్ని కూడా అంచనా వేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, వాటికి ప్రాధాన్యత క్రమంలో పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అనుమతులు లేకుండా బోర్లు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. భూగర్భ జలాల శాఖ నివేదికలు, సంబంధిత నిబంధనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బోర్ల ఏర్పాటుకు సంబంధించిన చర్యలు చేపట్టేలా చూడాలన్నారు. ముఖ్యంగా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనవసరంగా బోర్లు వేసి రైతులు ఆర్థికంగా నష్టపోకుండా క్షేత్రస్థాయి అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఆవాసంలో అవసరమైన పనులను గుర్తించి, వర్క్షెల్ఫ్లో తగినన్ని పనులు ఉండేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ముఖ్యంగా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు దోహదపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయి పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనుల పురోగతికి సంబంధించిన వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన మస్టర్లు, హాజరు, చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన వారికి సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ పనుల అమలును పర్యవేక్షించాలన్నారు.
మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. బల్క్ వాటర్ సరఫరాతోపాటు అంతర్గత పైప్లైన్లు, గృహాలకు నీటి సరఫరా కనెక్షన్లలో సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాలన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులు సమన్వయంతో స్పందించి, అందుబాటులో ఉన్న నిధులను అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సూచించారు.
జిల్లాలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో జెడ్పీ సీఈవో శ్రీనివాస్ రావు, డీఆర్డీవో వెంకట్ రాములు, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, గ్రిడ్ ఈ ఈ శ్రీనివాస్, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ మల్లికార్జున్, సివిల్ సప్లై అధికారి బాల్రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, అన్ని మండలాల ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
