దిల్లీలో భారీ పేలుడు.. 8 మంది మృతి

దేశ రాజధాని దిల్లీలో పేలుళ్లు తీవ్ర కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ స్విఫ్ట్​ కార్లలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఈ పేలుడు ధాటికి అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనితో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. గేట్ నంబర్ వన్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటనలో అనేక వాహనాలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. భారీశబ్ధాలతో అక్కడివారు వణికిపోయారు. పేలుడు శబ్ధం కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఐటీవో వరకు వినబడింది. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక దళాలు అక్కడకు చేరుకున్నాయి. 25కు పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేశాయి. ఈ ఘటనతో ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు అమిత్​ షా దిల్లీ పోలీస్ కమిషనర్​తో మాట్లాడారు. ఐబీ డైరెక్టర్​తో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు.

“ఆసుపత్రికి 15 మంది క్షతగాత్రులను తీసుకువచ్చారు. వారిలో 8 మంది మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఒక వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.” అని ఎల్​ఎన్​జేపీ ఆసుపత్రి సూపరింటెండెంట్​ చెప్పారు. అయితే ఘటనాస్థలంలో పరిస్థితిని చూస్తే ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి లాగానే కనిపిస్తోంది. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి గందరగోళంగా మారింది. దిల్లీ పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఎర్రకోట సహా కీలక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. దిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్, ఎన్​ఐఏ, ఎన్​ఎస్​జీ బృందాలు రంగంలోకి దిగాయి. దిల్లీ, హరియాణా, యూపీలను కలిపే అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసు నిఘాను పెంచారు. రైల్వే స్టేషన్లు, మెట్రోస్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దిల్లీ- హరియాణా సరిహద్దు సమీపంలో వాహనాలు, లాడ్జీలను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా సింఘు, టిక్రీ, బదర్‌పుర్‌ సరిహద్దుల వద్ద అదనపు పికెట్‌లను ఏర్పాటు చేసి గస్తీని ముమ్మరం చేశారు. అయితే ప్రతి సోమవారం దిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు. అందువల్ల ప్రమాదం తీవ్రత, ప్రాణ నష్టం కాస్త తగ్గిందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *