Badrinath and Kedarnath: ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల్లో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల విషయంలో అక్కడి ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఆలయాల్లోకి కేవలం హిందువులను మాత్రమే అనుమతించాలని, హిందువేతరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. చార్ ధామ్ యాత్రలో అత్యంత ముఖ్యమైన ఈ ఆలయాల పవిత్రతను కాపాడే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ నిర్వాహక వర్గం వెల్లడించింది.
Badrinath and Kedarnath: అన్ని అనుబంధ ఆలయాలకూ వర్తింపు
బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) ఆధీనంలో ఉన్న అన్ని దేవాలయాలకు ఈ నిషేధం వర్తిస్తుందని కమిటీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రధాన ఆలయాలతో పాటు కమిటీ నియంత్రణలో ఉన్న ఇతర చిన్న ఆలయాల్లోనూ హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను రాబోయే ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో చర్చించి, అధికారికంగా ఆమోదించనున్నారు. బోర్డు ఆమోదం లభించిన వెంటనే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
గంగోత్రి, ముఖ్బాలోనూ
ఆంక్షలు కేవలం బద్రీనాథ్, కేదార్‌నాథ్(Badrinath and Kedarnath) మాత్రమే కాకుండా గంగోత్రి ధామ్‌లో కూడా హిందువేతరులను అనుమతించకూడదని నిర్ణయించారు. ఈ విషయాన్ని శ్రీ గంగోత్రి ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేష్ సెమ్వాల్ ధృవీకరించారు. గంగోత్రి ఆలయంతో పాటు, గంగాదేవి శీతాకాల విడిదిగా భావించే ‘ముఖ్బా’లో కూడా ఈ ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నారు. ఆలయ సంప్రదాయాలను గౌరవించని వారి ప్రవేశాన్ని అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.
ప్రస్తుతం మూసివేతలో ఆలయాలు
ప్రస్తుతం శీతాకాలం కారణంగా చార్ ధామ్ ఆలయాల ద్వారాలు భక్తుల సందర్శనార్థం మూసివేయబడ్డాయి. ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో భారీ హిమపాతం, గడ్డకట్టే చలి కారణంగా ఆలయాలను మూసివేసి, తిరిగి ఏప్రిల్ లేదా మే నెలలో తెరుస్తారు. గంగోత్రి ఆలయం మూసివేసిన ఈ ఆరు నెలల కాలంలో భక్తులు ముఖ్బా గ్రామంలోని గంగాదేవి శీతాకాల నివాసంలో పూజలు నిర్వహిస్తుంటారు. ఇకపై అక్కడికి వెళ్లే భక్తులకు కూడా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి
