PM SHRI: విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘పీఎంశ్రీ’ (PM SHRI) పాఠశాలలను బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలో పీఎంశ్రీ పాఠశాలల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉత్తర్‌ప్రదేశ్ 1,725 పాఠశాలలతో మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 935 పాఠశాలలతో రెండో స్థానంలో నిలవడం రాష్ట్ర విద్యాశాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
నిధుల వెల్లువ – మౌలిక సదుపాయాల కల్పన ఈ పాఠశాలల్లో సదుపాయాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు వెచ్చిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.407.53 కోట్లను మంజూరు చేసింది. సమగ్ర శిక్షా అభియాన్ (SSA) ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని, ఒక్కో పాఠశాల నిర్వహణకు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
వృత్తి విద్యకు పెద్దపీట విద్యార్థులకు చిన్ననాటి నుంచే నైపుణ్యాలు నేర్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచించింది.
-
రాష్ట్రంలోని 794 పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు 10 రకాల వృత్తి విద్యా కోర్సులను (Vocational Courses) అందుబాటులోకి తెచ్చారు.
-
విద్యార్థులు నేర్చుకున్న విషయాలను ప్రాక్టికల్‌గా చేసి చూసేందుకు 1,898 ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు.
-
శిక్షణ కోసం 1,898 మంది అర్హలైన నిపుణులను నియమించారు. వీరిలో 400 మంది ఎన్ఎస్డీసీ (NSDC) గుర్తింపు పొందిన వారు ఉండటం విశేషం.
-
దసరా, సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు స్థానిక పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
ఆరోగ్యం మరియు సమ్మిళిత విద్య పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ఆర్వో (RO) ప్లాంట్లు, చేతులు కడుక్కోవడానికి వాష్ పాయింట్లు, ఆధునిక మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా బాలికల సౌకర్యార్థం శానిటరీ ప్యాడ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
PM SHRI: దివ్యాంగులైన విద్యార్థుల కోసం (Special Needs) ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి అవసరమైన ప్రత్యేక సామాగ్రిని అందిస్తున్నారు. అలాగే 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ రూపొందించిన ‘కౌశల్ బోధ్’ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా పీఎంశ్రీ పాఠశాలల ద్వారా ఏపీలోని ప్రభుత్వ బడులు కార్పొరేట్ స్థాయికి దీటుగా మారుతున్నాయి
