Andhra Pradesh Cabinet: 35 అంశాలకు ఆమోదం.. లడ్డూ వివాదం, అమరావతిపై చంద్రబాబు దిశానిర్దేశం

Andhra Pradesh Cabinet : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో 35 అంశాలకు ఆమోదం లభించింది. ఆ వివరాలు ఇవే

Andhra Pradesh Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించి మొత్తం 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం, సిట్ (SIT) దర్యాప్తు, అమరావతి రాజధాని పనులు, క్రీడాకారులకు ప్రోత్సాహకాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు.

తితిదే లడ్డూ వివాదం – సిట్ నివేదికపై చర్చ: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఏర్పాటు చేసిన ‘సిట్’ (SIT) నివేదిక అంశం కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ వ్యవహారంపై గత ప్రభుత్వం, వైసీపీ చేస్తున్న ప్రచారంపై మంత్రులు చర్చించారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. సిట్ నివేదిక అధికారికంగా చేతికి అందేవరకు వేచి చూడాలని మంత్రులకు సూచించారు. ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసిందని, పూర్తి నివేదిక వచ్చాక ప్రభుత్వం తరపున అధికారికంగా స్పందిద్దామని ఆయన దిశానిర్దేశం చేశారు.

క్రీడాకారిణి జ్యోతికి బంపర్ ఆఫర్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేసింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించి అర్జున అవార్డు పొందిన అథ్లెట్ జ్యోతికి విశాఖపట్నంలో 500 చదరపు గజాల నివాస స్థలాన్ని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా, ఆమె డిగ్రీ పూర్తయిన వెంటనే గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అమరావతి రైతులకు, పేదలకు ఊరట: Andhra Pradesh Cabinet: రాజధాని అమరావతి పరిధిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని నిర్మాణంలో వీధిపోటు కారణంగా ఇబ్బంది పడుతున్న భూములు పొందిన రైతులకు, వాటికి ప్రత్యామ్నాయంగా వేరే ప్లాట్లు కేటాయించడానికి ఆమోదం తెలిపారు. అలాగే అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు సామాజిక భద్రత కింద పింఛన్ల మంజూరుకు ఆమోదం లభించింది. ఏపీ టిడ్కో (APTIDCO) గృహ నిర్మాణాల కోసం హడ్కో (HUDCO) నుండి రూ.4,451 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

వైద్యం, పర్యాటకం మరియు ఇతర నిర్ణయాలు: రాష్ట్రంలో వైద్య, పర్యాటక రంగాల అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకున్నారు:

  • పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ (PPP) పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు.

  • అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫైవ్‌స్టార్‌ రిసార్ట్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, థీమ్‌ పార్కు ఏర్పాటుకు భూమి కేటాయించారు.

  • తిరుపతి, విశాఖపట్నం శిల్పారామం ప్రాజెక్టుల కోసం గతంలో ఒక ప్రైవేట్ సంస్థకు ఇచ్చిన లేఖలను (LOI) రద్దు చేసి, కొత్తగా బిడ్లను (EOI) ఆహ్వానించాలని నిర్ణయించారు.

  • గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

Andhra Pradesh Cabinet: వీటితో పాటు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు, ఇంధన శాఖలో పరిపాలనాపరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *