T20 World Cup 2026: ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతోంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న భారత జట్టు, తన కిరీటాన్ని కాపాడుకునే లక్ష్యంతో టోర్నమెంట్‌లో అడుగుపెడుతోంది. ఈ కీలక పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. భారత్ తొలి మ్యాచ్‌లో అమెరికా జట్టుతో తలపడనుంది.
ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఏ జట్టూ తన టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకోలేకపోయింది. అలాంటి అరుదైన ఘనతను సాధించాలనే దృఢ సంకల్పంతో టీమ్ ఇండియా ఈసారి బరిలోకి దిగుతోంది. గత ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టుకు అమెరికా గట్టి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అదే జట్టు మళ్లీ తొలి అడ్డంకిగా నిలవడం ఆసక్తికరంగా మారింది.
T20 World Cup 2026: అమెరికా జట్టు కూర్పు కూడా ప్రత్యేకంగా ఉంది. మొత్తం జట్టులో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే అమెరికాలో జన్మించగా, మిగతా 11 మంది విదేశాల్లో పుట్టినవారే. అయినా గత కొన్నేళ్లుగా అమెరికా క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన చేస్తూ బలమైన జట్టుగా ఎదుగుతోంది. ముఖ్యంగా ఎడమచేతి వాటం పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ భారత బ్యాట్స్‌మెన్‌కు ప్రధాన సవాలుగా మారే అవకాశం ఉంది. గత ప్రపంచ కప్‌లో పవర్‌ప్లేలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి తన ఫామ్‌ను చాటింది. గత టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత్ ఎనిమిది జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడి, వాటిలో ఒక్కదాన్ని కూడా కోల్పోలేదు. మొత్తం 34 మ్యాచ్‌ల్లో 25 గెలుపులు సాధించగా, కేవలం ఆరు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది.
హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే భారత్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. అమెరికాతో ఇప్పటివరకు జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఆ మ్యాచ్‌లో కూడా అమెరికా బౌలర్లు భారత టాప్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టిన విషయం గుర్తుంచుకోవాలి.
T20 World Cup 2026: వాతావరణం విషయానికి వస్తే, ముంబైలో ఈరోజు వర్షం పడే అవకాశం లేదు. ఉష్ణోగ్రత 30 నుంచి 35 డిగ్రీల మధ్య ఉండనుంది. పగలు–రాత్రి ఉష్ణోగ్రతల తేడాతో స్వల్ప మంచు ఏర్పడితే, వాంఖడే పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ప్రారంభంలో పేసర్లకు కొంత సహాయం లభించినా, తర్వాత పరుగులు చేయడం సులభమే. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
