Ekalavya Model Schools: ఏపీలో ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో ఉచిత విద్య: ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

Ekalavya Model Schools: ఉచిత విద్య, హాస్టల్ సౌకర్యాలతో ఏపీలోని ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

Ekalavya Model Schools: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన, పేద కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్‌ఎస్‌)లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ స్కూల్స్‌లో చదువు, హాస్టల్ వసతి పూర్తిగా ఉచితం. ఈ ప్రవేశాలు ఏపీలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో జరుగుతున్నాయి.

ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి నుంచి ఇంటర్ (12వ తరగతి) వరకు విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. ఈ స్కూల్స్ అన్నీ కో-ఎడ్యుకేషన్ విధానంలో, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌తో పనిచేస్తున్నాయి. ఒక్కో స్కూల్‌ను సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం విశేషం. ఆరో తరగతిలో ఒకసారి ప్రవేశం పొందితే, ఇంటర్ వరకు ఎలాంటి ఫీజులు లేకుండా చదువుకునే అవకాశం ఉంటుంది. వసతి, భోజనం, ఇతర మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వమే అందిస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 28 ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో మొత్తం 1680 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే అత్యధికంగా 11 స్కూల్స్ ఉన్నాయి. ఒక్కో క్లాస్‌కు 60 సీట్లు ఉంటాయి. అందులో 30 సీట్లు బాలికలకు, 30 సీట్లు బాలురకు కేటాయిస్తారు. ఈ 60 సీట్లలో 48 సీట్లు గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా రిజర్వ్ చేస్తారు. మిగిలిన 12 సీట్లలో పీవీటీజీలకు 3, అనాథ పిల్లలకు 6 (ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ కులాలకు చెందినవారు), దివ్యాంగులు మరియు సంచార కుటుంబాల పిల్లలకు 3 సీట్లు కేటాయించారు.

Ekalavya Model Schools: ఆరో తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 28 ఫిబ్రవరి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 31 నాటికి 10 నుంచి 13 ఏళ్ల వయసు ఉండి, ప్రస్తుతం ఐదో తరగతి తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం లక్ష రూపాయలకు మించకూడదు. తెల్ల రేషన్ కార్డు ఉండటం తప్పనిసరి.

ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు రూ.50 రుసుము చెల్లించాలి. విద్యార్థి పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం, ఆధార్ వివరాలు, తల్లిదండ్రుల ఆధార్, కులం, నివాస ధ్రువీకరణ, రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలి. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయ్యాక దరఖాస్తు ప్రింట్ తీసుకుని సంబంధిత ఏకలవ్య స్కూల్‌లో సమర్పించాలి. అనంతరం ఏప్రిల్ 4న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఐదో తరగతి సిలబస్ ఆధారంగా 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మెంటల్ ఎబిలిటీకి 50 మార్కులు, అర్థమేటిక్‌కు 25 మార్కులు, తెలుగు భాషకు 25 మార్కులు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *