Ugadi Celebrations: అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం.. సీఎం చంద్రబాబు 

Ugadi Celebrations

Ugadi Celebrations: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు సంస్కృతి, సాంకేతిక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై తన ప్రభుత్వ దిశను వివరించారు.

సీఎం మాట్లాడుతూ మన పండుగలు, ఆచారాల్లో శాస్త్రీయత దాగి ఉందని పేర్కొన్నారు. వాస్తు, సూర్యనమస్కారం వంటి అంశాలు శాస్త్రీయ ఆధారాలతో ఉన్నవని అన్నారు. యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలు కూడా ప్రకృతి నుంచి వచ్చినవేనని, ఆరోగ్యం, ఆనందం, సంపద ఇవన్నీ వాటి ద్వారానే సాధ్యమవుతాయని చెప్పారు.

సాంకేతికత ప్రాధాన్యంపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి టెక్నాలజీ ఆధారిత పాలన అమలులోకి వచ్చే అవకాశముందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకునే స్థాయికి దేశం చేరుకుంటుందని అన్నారు.

తాను 30 ఏళ్ల క్రితమే ఐటీ విప్లవాన్ని ఊహించి టెక్నాలజీని ప్రోత్సహించానని గుర్తుచేశారు. ఆ నిర్ణయాల వల్లే హైదరాబాద్ నగరం నాలెడ్జ్ ఎకానమీగా ఎదిగిందని చెప్పారు. ఐటీ రంగం ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు జీవన ప్రమాణాలను పెంచిందని అభిప్రాయపడ్డారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై కూడా ఆయన దృష్టి సారించారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు సంస్కృతిని కాపాడుతూ అంబాసిడర్లుగా నిలుస్తున్నారని అన్నారు. 2047 నాటికి తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడుతూ “సంజీవనీ” ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వ్యక్తిగత వైద్య సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. “అన్నదాత సుఖీభవ” ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, “స్త్రీశక్తి” ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెప్పారు. దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు.

సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ ద్వారా జనాభా పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు పీ4 కార్యక్రమాన్ని తీసుకువచ్చామని వివరించారు.

అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడుతూ విశాఖ, తిరుపతి, అమరావతిని కేంద్రంగా ఆర్థిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోర్టులు, విమానాశ్రయాలు, రహదారులు, రైల్వే మార్గాలను అనుసంధానం చేసి లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్వాసితులకు రూ.1,943 కోట్లు చెల్లించామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, గోదావరి పుష్కరాల ముందు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *