Success Story: జీవితంలో ఎంత కష్టాలున్నా పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని నిరూపించింది తెలంగాణ ములుగు జిల్లా జేడీ మల్లంపల్లి గ్రామానికి చెందిన మౌనిక. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పడిన కష్టాలను చూసి వారికి ప్రతిఫలం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆ కల నిజమై.. ఆమె డీఎస్పీగా ఎంపికైంది.
Success Story: మౌనిక తండ్రి సమ్మయ్య చిన్న పంచర్ షాపు నడుపుతుండగా, తల్లి సరోజ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఆర్థిక పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా.. కూతురు చదువుకు మాత్రం అడ్డంకులు రానివ్వలేదు. తల్లిదండ్రుల త్యాగాలు చూసిన మౌనిక చిన్నప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Free Travel: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్.. ఇక నుండి ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!
2020లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. కోచింగ్ సెంటర్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే కఠినంగా చదివింది. రోజుకు 12 గంటలపాటు పుస్తకాలు చదివి, టెస్ట్ పేపర్లు రాస్తూ తన బలహీనతలను సరిదిద్దుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.
తాజాగా విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో మౌనిక 315వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికైంది. ఒకప్పుడు తల్లిదండ్రులు చెమటోడ్చి నడిపిన పంక్చర్ షాపు ముందు.. ఈరోజు డీఎస్పీగా నిలబడ్డ కూతురిని చూసి వారి కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి.
మౌనిక విజయంతో గ్రామం గర్విస్తోంది. ఆమె ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయం కాదు.. పేద, మధ్యతరగతి యువతకు స్ఫూర్తిదాయకం. శ్రమను ఆయుధంగా మార్చుకుంటే విజయమే నీ సొంతం అవుతుందని ఆమె తన జీవితంతోనే నిరూపించింది.

