Kidney Patients: కిడ్నీ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఊరట.. రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు!

Kidney Patients: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 11.03 కోట్ల వ్యయంతో 13 కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్ నాటికి అందుబాటులోకి

Kidney Patients: ఆంధ్రప్రదేశ్‌లోని కిడ్నీ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నివసించే రోగులకు డయాలసిస్ సేవలను చేరువ చేసేందుకు కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. శనివారం అమరావతిలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

Kidney Patients: మారుమూల ప్రాంతాల రోగులకు వరం

సాధారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం పట్టణాలు లేదా నగరాల్లోని పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ ఖర్చులతో పాటు రోగులకు శారీరక శ్రమ కూడా అధికమవుతోంది. ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం, సెకండరీ హాస్పిటల్స్ (ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు) లోనే ఈ సౌకర్యాలను కల్పిస్తోంది.

మంత్రి సత్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 కేంద్రాలలో 2 కేంద్రాలను ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని త్వరలోనే ప్రారంభిస్తామని, మిగిలిన 11 కేంద్రాలను ఏప్రిల్ 2026 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.

రూ. 11.03 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు

ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ (PMNDP) కింద ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 11.03 కోట్లు మంజూరు చేసింది.

  • ప్రతి కేంద్రంలో సుమారు రూ. 85 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి.

  • ఒక్కో కేంద్రంలో 5 మెషీన్ల చొప్పున ఏర్పాటు చేస్తారు.

  • ఇప్పటికే ఈ ప్రక్రియ టెండర్ల దశలో ఉంది.

కొత్తగా ఏర్పాటు కానున్న ప్రాంతాలు ఇవే:

Kidney Patients: ప్రభుత్వం ప్రకటించిన జాబితా ప్రకారం ఈ క్రింది ప్రాంతాల్లో కొత్త కేంద్రాలు రానున్నాయి:

  • ప్రకాశం: అద్దంకి, కొండపి

  • నంద్యాల: సున్నిపెంట

  • పశ్చిమ గోదావరి: భీమవరం

  • కడప: జమ్మలమడుగు, మైదుకూరు

  • చిత్తూరు: పీలేరు

  • నెల్లూరు: వెంకటగిరి

  • పార్వతీపురం మన్యం: సీతంపేట (గిరిజన ప్రాంతం)

  • విజయనగరం: ఎస్.కోట (గిరిజన ప్రాంతం)

  • తిరుపతి: రైల్వేకోడూరు

  • తూర్పుగోదావరి: కొవ్వూరు

  • ఎన్టీఆర్ జిల్లా: నందిగామ

స్థానిక ఎమ్మెల్యేల విన్నపాలు, ప్రజల అవసరాల మేరకు ఈ ప్రాంతాలను ఎంపిక చేసినట్లు మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 12 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పుడు మరో 13 చేరడంతో మొత్తం 25 కొత్త కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల పేద, మధ్యతరగతి కిడ్నీ రోగులకు ఉచితంగా, ఇంటికి సమీపంలోనే వైద్యం అందనుంది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *