Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ మాయాజాలం: రూ. 70 లక్షలు నష్టపోయి ప్రాణాలు తీసుకున్న వ్యాపారి

Online Betting: నిర్మల్ జిల్లాకు చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి ప్రేమ్ కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ. 70 లక్షలు నష్టపోయి ప్రాణాలు తీసుకున్నాడు

Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారి మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, ఈజీ మనీ కోసం యువత, మధ్యవయస్కులు పడుతున్న ఆరాటం వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ ప్రేమ్ కుమార్ (39) అనే వ్యాపారి, ఆన్‌లైన్ బెట్టింగ్‌లో సుమారు రూ. 70 లక్షలు నష్టపోయి, అప్పుల బాధ తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం చించోలి (బి) గ్రామ శివారులో ఆయన మృతదేహం లభ్యమైంది.

కుటుంబంలో తీరని విషాదం

ప్రేమ్ కుమార్ గత పదేళ్లుగా గ్రామంలో ఫర్టిలైజర్ (ఎరువుల) వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన తండ్రి తారాసింగ్ పోలీస్ శాఖలో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రేమ్ కుమార్‌కు భార్య అమృత, కుమారుడు రాజా (12), కుమార్తెలు దీపిక (10), రోషిణి (8) ఉన్నారు. ఎంతో సంతోషంగా సాగుతున్న వారి సంసారంలో ఆన్‌లైన్ బెట్టింగ్ చిచ్చు పెట్టింది.

Online Betting: బెట్టింగ్ వ్యసనం.. రూ. 70 లక్షల నష్టం

వ్యాపారంలో వచ్చిన లాభాలను, ఆ తర్వాత చేసిన అప్పులను ప్రేమ్ కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌ల కోసం తగలేశాడు. ఈ వ్యసనం వల్ల అటు వ్యాపారం దెబ్బతినడమే కాకుండా, మొత్తం మీద రూ. 70 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరగడం, చేసిన తప్పును కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన ప్రేమ్ కుమార్ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం వెతకగా, చించోలి (బి) మైనార్టీ గురుకుల పాఠశాల సమీపంలో ఆయన విగతజీవిగా కనిపించాడు.

పోలీసుల దర్యాప్తు

Online Betting: సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ్ కుమార్ తన కుడిచేతి మణికట్టును బ్లేడుతో కోసుకుని చనిపోయినట్లు  ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన స్థలంలో పురుగుల మందు డబ్బా కూడా లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గమనిక: ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది ఒక వ్యసనం. ఇది ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా కృంగదీస్తుంది. మీకు లేదా మీకు తెలిసిన వారికి ఆత్మహత్య ఆలోచనలు ఉంటే, దయచేసి వెంటనే సహాయం కోసం ‘డైల్ 100’ లేదా హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *