T20 World Cup 2026: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఒక అద్భుతమైన పోరు జరిగింది. దక్షిణాఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో విజేత ఎవరో తేలడానికి ఏకంగా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా డబుల్ సూపర్ ఓవర్ నమోదైన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ సాగిందిలా..
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (61), క్వింటన్ డికాక్ (59) అర్థ సెంచరీలతో రాణించారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (84) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివరి ఓవర్లో నాటకీయ పరిణామాల మధ్య ఆఫ్ఘనిస్తాన్ 19.4 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులకే ఆలౌట్ కావడంతో మ్యాచ్ టై అయ్యింది.
T20 World Cup 2026: తొలి సూపర్ ఓవర్:
-
ఆఫ్ఘనిస్తాన్: మొదట బ్యాటింగ్ చేసి 17 పరుగులు సాధించింది.
-
దక్షిణాఫ్రికా: లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్ సిక్స్ బాదడంతో స్కోర్లు మళ్ళీ సమం (17-17) అయ్యాయి. దీంతో ఫలితం కోసం రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది.
రెండో సూపర్ ఓవర్ (డబుల్ సూపర్ ఓవర్):
T20 World Cup 2026: ఈసారి దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ చెరో మూడు సిక్సర్లు బాదడంతో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేసింది. 24 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్, కేశవ్ మహరాజ్ వేసిన ఓవర్లో రెండో బంతికే నబీ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత గుర్బాజ్ వరుసగా 3 సిక్సర్లు బాది విజయంపై ఆశలు రేపాడు. కానీ ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సిన దశలో గుర్బాజ్ క్యాచ్ అవుట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ 19 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
ఈ విజయంతో దక్షిణాఫ్రికా తన గ్రూప్ డిలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ కూడా 4 పాయింట్లతో ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ పరంగా దక్షిణాఫ్రికా ముందంజలో ఉంది. ఈ మ్యాచ్‌తో క్వార్టర్ ఫైనల్ రేసు మరింత రసవత్తరంగా మారింది.
