ఆంధ్రప్రదేశ్ కు మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. తుపాను కారణంగా ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు, పంటలు, ఆక్వా, చేనేత రంగాలు దెబ్బతిన్నాయని అన్ని రంగాల్లో మొత్తంగా రూ.6384 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు కేంద్ర బృందానికి సీఎం వివరించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో తుపాను నష్టంపై అంచనాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనల్ని సీఎం దృష్టికి తీసుకువచ్చింది. రెండు బృందాలుగా వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించి తుపాను నష్టాన్ని అంచనా వేశామని వివరించింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను సందర్శించనట్టు తెలిపింది. మొంథా తుపాను, భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు మొంథా తుపాను కారణంగా ప్రభావితం అయ్యాయని ప్రభుత్వం నివేదికలో పేర్కోంది.
దాదాపు 10 లక్షల మంది తుపానుతో పాటు భారీ వర్షాలకు ప్రభావితం అయ్యారని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 9,960 ఇళ్లు నీట మునిగాయని 1.11 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారని ప్రభుత్వం పేర్కోంది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు 4,566 ఇళ్లు దెబ్బతిన్నట్టు వివరించింది. 1.61 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని.. 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారని కేంద్ర బృందానికి నివేదించింది. వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, పశుసంవర్ధకం, చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడించింది.
4,794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, 12,856 విద్యుత్ స్తంభాలు నేల కూలినట్టు తెలిపింది. అలాగే 2,318 విద్యుత్ ట్రాన్సఫార్మర్లు పాడయ్యాయని నివేదికలో పేర్కొంది. మొంథా తుపాను వల్ల నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు 22 జిల్లాల్లో 1.92 లక్షల మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 3.36 లక్షల కుటుంబాలకు రూ.3 వేల చొప్పున తక్షణ ఆర్ధిక సాయంగా అందించినట్టు కేంద్ర బృందానికి వివరించింది. రాష్ట్రంలో రహదారులు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలను తక్షణం పునరుద్ధరించేందుకు తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదించింది.
